155 కంపెనీలు.. 22 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

155 Indian companies create nearly 125000 jobs in US - Sakshi

1.25 లక్షల ఉద్యోగాల కల్పన

అమెరికాలో భారత సంస్థల ఘనత

సీఐఐ నివేదికలో వెల్లడి  

న్యూఢిల్లీ: పెట్టుబడులు, భారీగా ఉపాధి కల్పన రూపంలో భారతీయ సంస్థలు అమెరికా ఎకానమీ వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. భారత మూలాలున్న దాదాపు 155 కంపెనీలు అమెరికాలో 22 బిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశాయి. 1.25 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కల్పించాయి. ’అమెరికా నేల, భారతీయ మూలాలు 2020’ పేరిట రూపొందించిన ఓ సర్వే నివేదికలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఈ అంశాలు వెల్లడించింది. అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా భారతీయ కంపెనీల పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాలు మొదలైన వివరాలు ఇందులో పొందుపర్చింది.

అత్యధిక కంపెనీలు న్యూజెర్సీలో..: భారతీయ కంపెనీలు అత్యధికంగా న్యూజెర్సీ, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయిస్, జార్జియా రాష్ట్రాల్లో ఉన్నాయి. పెట్టుబడుల పరంగా చూస్తే అత్యధికంగా టెక్సాస్‌ (9.5 బిలియన్‌ డాలర్లు), న్యూజెర్సీ (2.4 బిలియన్‌ డాలర్లు), న్యూయార్క్‌ (1.8 బిలియన్‌ డాలర్లు), ఫ్లోరిడా (915 మిలియన్‌ డాలర్లు), మసాచుసెట్స్‌ (873 మిలియన్‌ డాలర్లు)లో ఇన్వెస్ట్‌ చేశాయి. ఉపాధి కల్పన సంగతి తీసుకుంటే అత్యధికంగా టెక్సాస్‌లో 17,578 ఉద్యోగాలు, కాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ (8,057), న్యూయార్క్‌ (6,175), ఫ్లోరిడాలో 5,454 ఉద్యోగాలు కల్పించాయి.  సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 77% కంపెనీలు వచ్చే అయిదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టే యోచనలో, 83 శాతం కంపెనీలు మరింత మంది స్థానికులను రిక్రూట్‌ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top