సీఎం సార్‌ ఎప్పుడొస్తారో..?

when cm kcr will come to meet with singareni employees - Sakshi

నాలుగు నెలల క్రితం సింగరేణికొస్తానన్న కేసీఆర్‌

ఇంకా ఖరారుకాని ముఖ్యమంత్రి పర్యటన 

కార్మికుల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరాశ 

పర్యటనపై నోరుమెదపని టీబీజీకేఎస్‌ నాయకులు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి పర్యటనపై సందిగ్ధం వీడడంలేదు. వస్తానని చెప్పి నాలుగు నెలలు గడిచింది. కానీ ఇంతవరకు రాలేదు. కనీసం ఎప్పుడొస్తారనే విషయం కూడా తెలియదు.  ఇటు అధికారికంగా, అటు యూనియన్‌పరంగా ఎవరూ ప్రకటించడంలేదు. మరోవైపు కార్మికులు సీఎం రాక కోసం ఎదురుచూస్తున్నారు. కారుణ్య నియామకాల జాప్యంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారని, అందుకే సీఎం పర్యటన వాయిదా వేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది. 
 

మందమర్రి(మంచిర్యాల జిల్లా) : గత అక్టోబర్‌ 5న జరిగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ విజయం సాధించింది. అదే నెల 8న హైదరాబాద్‌లోని ప్రగతి భవనలో కార్మికులు, టీబీజీకేఎస్‌ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి  ‘తాను ఇన్నినాళ్లు సింగరేణి కార్మికుల బాగోగు లు పట్టించుకోలేదు. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదు. కోల్‌బెల్ట్‌ పర్యటనకు నేనే వస్తాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించించారు.  క్షేత్ర స్థాయిలో కార్మికులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకుంటానని సెలవిచ్చారు. సీఎం హామీ ఇచ్చి నాలు గు నెలలు గడిచిపోయింది. కానీ ఇంకా పర్యటనకు రాలేదు.  

కారుణ్యమే అసలు కారణం..?
సీఎం పర్యటన జాప్యానికి కారుణ్య నియామకాలే ప్రతిబంధకంగా మారాయని తెలుస్తోంది. వారసత్వ ఉద్యోగాలకు న్యాయపరమైన సమస్య ఏర్పడడంతో  కారుణ్య నియామకాలు చేపడతామని సీఎం ప్రకటించారు. 1 నుంచి నాలుగు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్‌ ఉన్న వారు ఈ నియామకాలకు అర్హులని పేర్కొన్నా రు. కోటి ఆశలతో కార్మికుల పిల్లలు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. యేడాది సంవత్సరం సర్వీస్‌ ఉన్న వారే 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. నాలుగు నెలలు గడిచినా కారుణ్య నియామకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఇప్పటికే దాదాపు 500 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ కూడా చేశారు. దీంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

ఉద్దేశపూర్వకంగానే వాయిదా...
ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సింగరేణి ఉన్నతాధికారులు ఏర్పాట్లు సైతం చేశారు. మందమర్రిలో కాసీపేట, కేకే6 గనులతో అటు భూపాలపల్లిలో మరో రెండు గను లు ప్రారంభిస్తారన్న సమాచారం కూడా అందింది. దీంతో ఆయా ఏరియాల్లో హడావిడి చేశారు. సీఎం మాత్రం పర్యటించలేదు. టీబీజీకేఎస్‌ నాయకులు కూడా ఆ ప్రస్తావన తీసుకు రావ డం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచీ అధికారిక ప్రకటన రావడం లేదు. దీంతో కార్మికలోకంలో  సందిగ్ధత నెలకొంది.  

హామీలు అమలయ్యేనా?
సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు కూడా అమలు కు నోచుకోవడంలేదని కార్మికులు పేర్కొంటున్నారు. కార్మిక ఆదాయ పన్ను రద్దు నేటికీ అమలుకు నోచుకోవడం లేదని, దీనిపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి ప్రకటన చేయడం లేదని వాపోతున్నారు. కార్మికుల సొంతింటికల అడుగు ముందుకు పడలేదు. పదో వేతన ఒప్పందానికి సంబంధించిన ఎరియర్స్‌ ఇప్పటికీ చెల్లించలేదు. గతేడాది వచ్చిన లాభాల నుంచి ఏరియ ర్స్‌ కోసమే కొంత డబ్బు సమకూర్చామని దాట వేసే ధోరణిని ముఖ్యమంత్రి అవలంభించారని నేతలు విమర్శిస్తున్నారు. కారుణ్య నియామకాలతో సహా హామీలు గాలిలో కలిసి పోతుండడం కార్మికవర్గాన్ని తీవ్రనిరాశకు గురవుతోంది. ము ఖ్యమంత్రి స్పందించి సమస్యలు పట్టించుకోవాలని, రోడ్డున పడుతున్న కుటుంబాలను కాపా డాలని కార్మికులు కోరుతున్నారు.   

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top