
సింగరేణి (కొత్తగూడెం): తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణి సంస్థ ఇక్కట్లలో ఉంటే.. అప్పటి ప్రభుత్వాలు సుమారు రూ.450 కోట్లు అందించి ఆదుకున్నాయి. కానీ తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై కార్మికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాడు సంస్థ నిధులపై లేదా ఇతరత్రా విషయాల్లో ప్రభుత్వాల నుంచి కనీస జోక్యం లేకపోగా.. ఇప్పుడు కార్మికులు బదిలీలకు సైతం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు లేఖలు ఇస్తున్నారని వాపోతున్నారు. కొన్నిచోట్ల మాట వినని అధికారులపై వేటు వేయించడానికి సైతం వెనకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
సీఎస్సార్ నిధులు దుర్వినియోగం
వందల అడుగుల లోతులో రక్తాన్ని చెమటగా మార్చి, ప్రకృతికి విరుద్ధంగా రేయింబవళ్లు కష్టపడుతూ కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా వచ్చిన ఆదాయంలో కొంత శాతం ఓసీలు, భూగర్భ గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్సార్)గా వెచ్చిoచాల్సి ఉంటుంది.
కానీ ప్రభావిత ప్రాంతాలకు ఖర్చు చేయకుండా ఇతర చోట్ల వెచ్చిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నిధులను ప్రభావిత ప్రాంతాల్లో కాక మిగతా చోట్లకు కేటాయించొద్దని ఎవరైనా అధికారులు అడ్డుకున్నా పట్టింపు ఉండటం లేదని వాపోతున్నారు.
రూ.వేల కోట్ల బకాయిలు
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థకు సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అలా ఉండదని కాంగ్రెస్ నేతలు చెప్పినా ఇప్పుడు తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో జూలై నాటికి సింగరేణికి రూ.19 వేల కోట్ల బకాయి పడగా.. మొత్తం రూ.44 వేల కోట్లు బాకీ పడినట్లు సమాచారం.
కొత్త గనుల్లేక.. పాత గనులు బోసిపోయి..
సింగరేణి సంస్థ ఒకప్పుడు 76 భూగర్భ గనులు, 1.20 లక్షల మంది కార్మికులతో కళకళలాడేది. నానాటికీ గనుల్లో బొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటం, కొన్ని గనుల్లో గ్యాస్ బయటకు వస్తుండడంతో మూసివేశారు. ఫలితంగా ప్రస్తుతం సింగరేణిలో 22 భూగర్భ గనులు, 18 ఓపెన్‌కాస్ట్ గనుల్లో సుమారు 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఇక ఎవరైనా సరే వేలంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో కొన్నాళ్లుగా సింగరేణికి కొత్త గనులు దక్కలేదు. ఏళ్ల తర్వాత ఒడిశాలోని నైనీ బ్లాక్‌ను దక్కించుకోగా.. ఇటీవలే మళ్లీ వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.
బకాయిలు చెల్లించాల్సిందే..
సింగరేణి సంస్థకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలి. లేకపోతే సంస్థ అభివృద్ధి కుంటుపడుతుంది. పైగా సింగరేణి ఏ పని ముందుకు సాగాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరైంది. అధికారులు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ
ఆందోళనలు చేపడతాం
ఎన్నో హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 21 మాసాల్లో సింగరేణికి రూ.19 వేల కోట్లు బకాయి పడింది. కంపెనీకి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా మా యూనియన్ ఆధ్వర్యాన ఆందోళనలు చేపడతాం. – మిర్యాల రాజిరెడ్డి, అధ్యక్షుడు, టీబీజీకేఎస్
గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుతోనే..
గత ప్రభుత్వం బొగ్గు బకాయి లు చెల్లించి, విద్యుత్ బకాయిలు ఆపితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండింటినీ నిలిపివేసింది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు చెల్లించాలి. – పి.మాధవనాయక్, బీఎంఎస్ జాతీయ నేత