నాలుగింటిని కలిపి బాహుబలి మైన్
ఇందుకోసం 4 వేల హెక్టార్ల భూమి అవసరం..
ఇప్పటికే సింగరేణి వద్ద 3,266 హెక్టార్ల భూమి
రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో తొమ్మిది గ్రామాల్లో భూసేకరణ
19వ తేదీన ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అతి త్వరలో భారీ కోల్‌మైన్ కల సాకారం కానుంది. ఇందుకోసం సింగరేణి కంపెనీ వడివడిగా అడుగులు వేస్తోంది. సింగరేణి చరిత్రలోనే ఎన్నడూ చూడని భారీ ఉపరితల గని (ఓపెన్ కాస్ట్) ప్రాజెక్టు కోసం సంస్థ సిద్ధమైంది. ఇందుకు కావాల్సిన భూమి కోసం పర్యావరణ, ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి, కమాన్‌పూర్ మండలాల పరిధిలో భారీ బాహుబలి గని త్వరలోనే ఏర్పాటు కానుంది.
రామగిరి మండలంలోని పన్నూర్, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, రామయ్యపల్లి, కమాన్‌పూర్ మండలం వకీల్ పల్లి, జూలపల్లి, ముల్కలపల్లి మొత్తం తొమ్మిది గ్రామాల్లో ఈ ప్రాజెక్టు కోసం భూమిని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్రాజెక్టు కోసం దాదాపు 4,326.08 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది.
విలీనమయ్యే ప్రాజెక్టులు
రామగుండం కోల్‌మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతు న్నా యి. అందులో రామగుండం ఓపెన్‌కాస్ట్–1, ఎక్స్‌టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్‌కాస్ట్–2, ఆడ్రియా ల షాప్ట్ అండర్‌గ్రౌండ్ కోల్‌మైనింగ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు, వకీల్‌పల్లి మైన్‌తోపాటు మూసివేసిన 10వ ఇంక్‌లైన్ గనులను కలిపి భారీ ఉపరితల గనిగా మా ర్చనున్నారు.
ఈ బాహుబలి గని నుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయ డం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనేది ప్రణాళిక. ప్రాజెక్టులో భాగంగా మూసి వేసిన 10 ఇంక్‌లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్‌పల్లి మైన్‌ను కూడా ఓపెన్ కాస్ట్‌గా మారుస్తారు.
19న ప్రజాభిప్రాయ సేకరణ
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని పన్నూర్, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, రామయ్యపల్లి, కమాన్‌పూర్ మండలం వకీల్ పల్లి, జూలపల్లి, ముల్కలపల్లి మొత్తం తొమ్మిది గ్రా మాల్లో భూమిని సేకరించేందుకు ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈనెల 19న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. ఇందుకోసం ఏ గ్రామాలు ఎంత మేరకు ప్రభావితం అవుతున్నాయన్న సమాచారం తెలియజేసే వివరాలను పెద్దపల్లి కలెక్టరేట్, రామగుండం పీసీబీ కార్యాలయం, ఆర్డీఓ పెద్దపల్లి, ఆర్డీఓ మంథని కార్యాల యాలు, కమాన్‌పూర్, రామగుండం తహసీల్దార్ కార్యాలయాలు, 9 గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల కోసం అందుబాటులో ఉంచారు.


