రాష్ట్రంలో జగన్ హవా

రాష్ట్రంలో జగన్ హవా - Sakshi


 48%.. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి వచ్చే ఓట్లు

 30%.. టీడీపీకి వచ్చే ఓట్లు

 11%.. కాంగ్రెస్‌కు వచ్చే ఓట్లు


  సీఎన్‌ఎన్-ఐబీఎన్ సర్వే చెప్పిందిదీ ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే

 48 శాతం ఓట్లతో సీమాంధ్రను స్వీప్ చేయనున్న వైఎస్సార్‌సీపీ

 తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ

 ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే

 వైఎస్సార్‌సీపీకి 20 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదు: రాజ్‌దీప్

 కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపైనా తీవ్ర అసంతృప్తి

 యూపీఏ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది రాష్ట్రంలో 12 శాతమే

 రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ తీరుపై తెలంగాణలోనూ 33 శాతం వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఏకంగా 55 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పనితీరు పట్ల కూడా 54 శాతం మంది పెదవి విరుస్తున్నారు

 సీమాంధ్రలో ఏకంగా 70 శాతం మంది రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి

 రాకూడదని కోరుకుంటున్నారు

 రాష్ట్రం మొత్తమ్మీద చూసినా 56 శాతం మంది కాంగ్రెస్ ఓడిపోవాలనే ఆకాంక్షిస్తున్నారు


 

 సాక్షి, హైదరాబాద్:

 

 రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతోందని మరో సర్వే తేల్చి చెప్పింది. సీమాంధ్ర ప్రజలంతా పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని తేలింది. రాష్ట్ర అసెంబ్లీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీమాంధ్రలో ఏకంగా 48 శాతం మంది వైఎస్సార్‌సీపీకే ఓటేస్తారని జాతీయ ఆంగ్ల వార్తా చానల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ పేర్కొంది. 30 శాతం ఓట్లతో టీడీపీ రెండో స్థానంలో నిలుస్తుందని, అధికార కాంగ్రెస్ మాత్రం 11 శాతం ఓట్లతో సీమాంధ్రలో మూడో స్థానానికి దిగజారుతుందని వివరించింది. ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత అధ్యయన సంస్థ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్)తో కలిసి తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను సీఎన్‌ఎన్ మంగళవారం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కూడా ఆ ప్రాంతంలో పార్టీకి ఆశించినంతగా లాభం చేకూర్చలేదని సర్వే తేల్చింది. తెలంగాణలో 31 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్సే తొలి స్థానంలో నిలుస్తుందని వివరించింది. 29 శాతంతో కాంగ్రెస్ రెండో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని పేర్కొంది.  ఇక రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్న టీడీపీకి తెలంగాణలో కేవలం 13 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది. జనవరిలోనే లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగితే సీమాంధ్రలో ఏకంగా 41 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకే పడతాయని కూడా సీఎన్‌ఎన్ తేల్చింది. టీడీపీకి 28 శాతం, కాంగ్రెస్‌కు కేవలం 16 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. ‘‘ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా చూసినా కాంగ్రెస్‌కు లభించే ఓట్లు 24 శాతమే. అంటే 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన 39 శాతంతో పోలిస్తే ఏకంగా 15 శాతం మేరకు గండి పడనుంది. టీడీపీ ఓట్ల శాతం కూడా 4 శాతం తగ్గి 21కి పరిమితమవుతుంది. వైఎస్సార్‌సీపీ 22 శాతం ఓట్లు సాధిస్తుంది. ఆ లెక్కన రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో 11 నుంచి 19 స్థానాల దాకా కైవసం చేసుకుంటుంది’’ అని పేర్కొంది.

 

 ఇతర పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుంటే వైఎస్సార్‌సీపీ 20కి పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. టీడీపీకి 9-15 సీట్లు దక్కుతాయని, పాలక కాంగ్రెస్ మాత్రం 5 నుంచి 9 స్థానాలతో సింగిల్ డిజిట్‌కు పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో ఏకంగా 33 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌కు ఇది చావుదెబ్బేనని రాజ్‌దీప్ మాత్రమే గాక ఆయనతో పాటు చర్చలో పాల్గొన్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీనియర్ జర్నలిస్టు స్వపన్‌దాస్ గుప్తా తదితరులు పేర్కొన్నారు. ఇక టీఆర్‌ఎస్‌కు 4 నుంచి 8 లోక్‌సభ స్థానాలు రావచ్చని సర్వే అభిప్రాయపడింది.

 

 కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత

 

 ఇక కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలనను రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు సీఎన్‌ఎన్ సర్వే స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఏకంగా 55 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి పనితీరు పట్ల కూడా 54 శాతం మంది పెదవి విరుస్తున్నారు. ఇక సీమాంధ్రలో అయితే ఏకంగా 70 శాతం మంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద చూసినా 56 శాతం మంది కాంగ్రెస్ ఓడిపోవాలనే ఆకాంక్షిస్తున్నారు. ఈ సంఖ్య తెలంగాణలో 42 శాతంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు మరోసారి అవకాశం ఇచ్చేం దుకు రాష్ట్రంలో ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరు (12 శాతం) మాత్రమే సుముఖంగా ఉన్నారని సర్వే తేల్చింది! యూపీఏ పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నామని రాష్ట్రంలో 52 శాతం మంది స్పష్టం చేశారు.

 

 ‘తెలంగాణ’పై కాంగ్రెస్ తీరు ఘోరం

 

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరు సరిగా లేదని ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా భావిస్తున్నట్టు సర్వేలో తేలింది. దీనిపై కాంగ్రెస్ గందరగోళంగా వ్యవహరించిందని తెలంగాణలో కూడా 33 శాతం మంది అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో అయితే ఇది ఏకంగా 79 శాతంగా ఉంది. జనవరి 5-15 మధ్య రాష్ట్రంలోని 24 లోక్‌సభ స్థానాల పరిధిలో అత్యంత శాస్త్రీయ విధానంలో ఈ సర్వేను నిర్వహించినట్టు సీఎన్‌ఎన్-ఐబీఎన్ పేర్కొంది. శాంపిళ్లలో మహిళలు, యువకులు, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, గ్రామీణ, పట్టణ ఓటర్ల వంటివారందరికీ రాష్ట్ర జనాభాలో వారి నిష్పత్తికి తగ్గట్టుగా ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు వివరించింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top