లక్ష ఓట్లు తొలగింపు

YSRCP Voters Removed From Voters list Anantapur - Sakshi

వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా కుట్ర

2014తో పోలిస్తే భారీగా తగ్గిన జిల్లా ఓటర్లు

కొత్తగా నమోదు చేసినా పాత సంఖ్యను చేరని వైనం

అనంతపురం అర్బన్‌లో తీసివేతలు అత్యధికం

టీడీపీ ఓటు రాజకీయం చేస్తోందా? తమకు ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాల్లో బోగస్‌ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తోందా? ఇందుకోసం జిల్లా యంత్రాంగాన్నే అధికారికంగా వాడుకుంటోందా? పరిణామాలన్నీ పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. జిల్లాలో ఏకంగా లక్ష ఓట్లు తొలగించగా.. అత్యధికంగా అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ పరిధిలో 64,552 ఓట్లను తీసివేయడం అనుమానాలకు తావిస్తోంది.

అనంతపురం అర్బన్‌: ఏటా జనాభా పెరుగుతుంది. అదే క్రమంలో ఓటర్లూ పెరుగుతారు. అయితే జిల్లాలో మాత్రం ఏటికేడు ఓటర్లు తగ్గిపోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లలో ప్రస్తుతం 1,01,772 ఓట్లను తొలగించారు. అందులోనూ ఎక్కువగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులవే ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏడు నియోజకవర్గాలే టార్గెట్‌
2014 ఎన్నికల సమయంలో జిల్లావ్యాప్తంగా 29,87,264 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటిన ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 29,24,040 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా ఏడు నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించారు. అత్యధికంగా అనంతపురం నియోకవర్గంలో 64,592 ఓట్లను తొలగించారు. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గంలో 325 ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపు వ్యవహారం పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో దాదాపు 3 వేల ఓట్లు తొలగించారని, అదే విధంగా బోగస్‌ ఓట్లను చేర్చారని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌కు మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం నియోజకవర్గం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధారాలతో సహా ఇటీవల ఫిర్యాదు చేశారు. అదే విధంగా ఇతర నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించినట్లు ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఓట్ల తొలగింపును పరిశీలిస్తే అధికారపార్టీకి అధికారయంత్రాగం అనుకూలంగా వ్యవహరించి ఈ తంతంగం నడిపిందనే విషయం స్పష్టమవుతోంది. ప్రధానంగా అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, హిందూపురంలో తొలగించిన ఓట్ల సంఖ్య అధికంగా ఉంది.

పరిశీలిస్తాం.. సరిచేస్తాం
సాధారణంగా ఓట్ల నమోదు, తొలగింపు 5 శాతం హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే అనంతపురం అర్బన్‌లో 64,592 తొలగించడంపై పరిశీలన చేయిస్తున్నాం. రెండు చోట్ల ఓటు నమోదై ఉంటే తొలగించి ఉండవచ్చు. స్థానికంగా నివాసముంటున్న వారి ఓటు తొలగించి ఉంటే సరిచేస్తాం.– కలెక్టర్‌ వీరపాండియన్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top