చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కక్కించాలి..

YSRCP Reactions On Chandrababu Corruption - Sakshi

సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి బాగోతంపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. దోచుకున్న అవినీతి సొమ్మును కక్కించాలని తెలిపారు. అక్రమాలు బయట పడటంతో చంద్రబాబు, లోకేష్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని..తక్షణమే వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది మామూలు విషయం కాదు..
సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా 6 రోజులు సోదాలు జరపడం తన  జీవితంలో చూడలేదని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. రూ.2 వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మామూలు విషయం కాదన్నారు. మొన్నటి వరకు నష్టాల్లో ఉన్న లోకేష్‌ కంపెనీల విలువ ఒక్కసారిగా ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు అవినీతిలో పవన్‌కూ భాగం ఉంది..
ప్రతిపక్ష నేత చంద్రబాబు,లోకేష్‌ అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలని కోరారు. ఇప్పుడు బయటపడిన రూ.2 వేల కోట్ల అవినీతిపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

అడ్డంగా దొరికిపోయారు కాబట్టే..
పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారని.. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని చంద్రబాబు భావించారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సీఎంగా పని చేసినప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడుగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదన్నారు. మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట అని, అడ్డంగా దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు స్పందించటం లేదన్నారు.

ఆ మీడియాకు స్కామ్‌ కనిపించడం లేదా..?
చీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు రూ.2 వేల కోట్ల స్కామ్‌ కనిపించడం లేదా అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో చందబాబు పాత్ర ఉందని.. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా జోక్యం చేసుకుని.. చంద్రబాబు అవినీతిపై విచారణ జరిపించాలన్నారు.

ప్రజలకు కూడా అర్థమైంది..
చంద్రబాబు ఎంత దోచుకున్నారన్నది ఐటీ సోదాలతో తేలిపోయిందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. చంద్రబాబు అవినీతి, దాని వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ప్రతి రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని ఆయన ప్రశ్నించారు.

సీబీఐని వ్యతిరేకించింది అందుకేనా..?
చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైందని.. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా అని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలన్నారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని కృష్ణదాస్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ
చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. చంద్రబాబు చేసిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ప్రతి ప్రాజెక్టులో చినబాబుకు కమీషన్లు వెళ్లేవన్నారు. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అంజాద్‌ బాషా పేర్కొన్నారు.

వారు విదేశాలకు పారిపోయే అవకాశముంది..!
అక్రమాలు బయట పడటంతో చంద్రబాబు, లోకేష్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని..తక్షణమే వారి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోరారు. చంద్రబాబు అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని ఖజానాకు జమ చేయాలన్నారు. అమరావతి, పోలవరం పేర్లతో చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని.. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారన్నారు.

ఐటీ దాడులపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..
టీడీపీ నేతల అక్రమ సంపాదన ఇప్పుడు బట్ట బయలవుతోందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. కేవలం నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని.. పార్టీ ముఖ్య నేతలపై ఐటి దృష్టి సారిస్తే లక్షల కోట్లు బయటపడే అవకాశముందన్నారు. ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు

అవినీతికే ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌
దేశ చరిత్రలో అవినీతికి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడన్నారు. స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా జరగలేదన్నారు. రూ.3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకే అమరావతి అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

తేలు కుట్టిన దొంగ..
చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తన బినామీలపై సోదాలు జరుగుతుంటే ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ అక్రమాలు వెలుగులోకి రాకూడదనే చంద్రబాబు కృతిమ ఉద్యమం నడుపుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పార్టీలు పునరాలోచన చేసుకోవాలని సూచించారు.

ఇంకెన్ని లక్షల కోట్లు దోచుకున్నారో..?
చంద్రబాబు దగ్గర పని చేసిన పీఏ నే రూ.2 వేల కోట్లు దోచుకుంటే గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇంకెన్ని వేల, లక్షల కోట్లు దోచుకుని ఉంటారోనని తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సందేహం వ్యక్తం చేశారు. తాన బండారం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో అధికారంలో ఉండగా సీబీఐ, ఐటీ అధికారులు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు జీవోలు చేశారన్నారు. చంద్రబాబు దగ్గర అవినీతి సొమ్ము విచ్చలవిడిగా ఉందని తాము మొదటి నుండి చెబుతూనే ఉన్నామని, అది ఈ రోజు బయటపడిందన్నారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..
చంద్రబాబు అవినీతి చిట్టాపై లోతైనా విచారణ జరపాలని తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ‘పీఏ స్థాయి వ్యక్తి దగ్గరే రూ.2 వేల కోట్ల అవినీతి  బయటపడితే చంద్రబాబు అనుచరులు, కుటుంబ సభ్యుల వద్ద ఇంకా ఎంత ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ’ చెప్పాలన్నారు.

చంద్రబాబు,లోకేష్‌ల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలి..
డొల్ల కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్‌ కో లక్షల కోట్లు దోచుకున్నారని  యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) మండిపడ్డారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ దగ్గర చాలా విషయాలున్నాయి. ఆయన డైరీని పూర్తిగా పరిశీలిస్తే భారీ అక్రమాలు బయటపడతాయన్నారు. విదేశాలకు పారిపోకుండా చంద్రబాబు, లోకేష్‌ల పాస్‌పోర్టులు వెంటనే సీజ్‌ చేసి వారిని విచారించాలని కోరారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని రమణమూర్తి రాజు పేర్కొన్నారు.

సీఎం జగన్‌ గతంలోనే చెప్పారు..
చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ గతంలోనే చెప్పారని.. ఆ అవినీతి బండారం ఇవాళ బయట పడిందని  కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. పీఎస్‌ శ్రీనివాస్‌ వద్ద పట్టుబడిన సొమ్ము చంద్రబాబుదేనని.. అందువల్ల ఆయనను తక్షణమే అరెస్టు చేసి తీహారు జైలుకు పంపించి, అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐటి దాడుల్లో పట్టుడిన సొమ్ము ఈ రాష్ట్రానిదే కనుక, ఆ సొమ్మును అధికార వికేంద్రీకరణకు ఖర్చు పెడితే మన  రాజధానులు అభివృద్ధి చెందుతాయని సూచించారు..

రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచుకున్నారు..
తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య  ప్రశ్నించారు. ఐటీ దాడులపై ఆయన నోరు ఎందుకు విప్పడం లేదని ధ్వజమెత్తారు. పరిపాలించమని ఐదేళ్లు ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు.

పవన్‌కల్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు..?
రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. 1994 నుంచే ఆయన డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారనని ధ్వజమెత్తారు. ఓట్ల కొనుగోలుకు ఆద్యుడు చంద్రబాబు అని అన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఆయనకు అలవాటే..
చంద్రబాబు నిజాయితీ పరుడయితే ఐటీ కేసుపై విచారణ ఎదుర్కోవాలని నరసారావుపేట ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అవినీతికి పాల్పడటం, కోర్టుల నుంచి స్టే తెచ్చుకోవటం చంద్రబాబుకు అలవాటు అని, కానీ బయట మాత్రం తాను నిప్పునంటూ డబ్బాలు కొట్టుకుంటారని గోపిరెడ్డి ధ్వజమెత్తారు.

ఆ పార్టీ..ప్రజాధనాన్ని దోచుకునే సంస్థ..
టీడీపీ ఒక పార్టీ కాదని.. అది ప్రజాధనాన్ని దోచుకునే ఒక సంస్థ అని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ధ్వజమెత్తారు. అమరావతిలో రాజధాని భూములు పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమ అనే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్లు దోచుకున్నారని నిప్పులు చెరిగారు. ఎల్లో మీడియా రామోజీరావు, రాధాకృష్ణలు ఫోర్త్‌ ఎస్టేట్‌ను నాశనం చేశారని ఆమంచి కృష్ణమోహన్‌ ధ్వజమెత్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top