‘అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నారు’

YSRCP Nagireddy Files Petition Against AB Venkateswara Rao In High Court - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ ఇంటలెజిన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేసినప్పటికీ అనధికారికంగా విధుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన ఏపీ హైకోర్టులో గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు. కిందిస్థాయి ఉద్యోగులు ఏబీ వెంకటేశ్వరరావుకు నివేదికలు ఇస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు ఇంటలెజిన్స్‌ విధుల్లో కలుగజేసుకోకుండా.. అదే విధంగా ఆయన ఇచ్చిన గత నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావును ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.

ఈ నేపథ్యంలో పిటిషన్‌ విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు గత మంగళవారం జీవో (నంబర్‌ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు జీవో నంబరు 720 జారీ చేసింది. అదే విధంగా సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది కూడా . దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ గత శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగిరెడ్డి గురువారం పిటిషన్‌ దాఖలు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top