రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో నిరసన కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో నిరసన కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండాలని ఆ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును బీఏసీలో చర్చించకుండా, సభ అనుమతి లేకుండా చర్చకు అనుమతించడం దారుణం అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అందుకు నిరసనగా అసెంబ్లీలోనే వారు ఆందోళన చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, శాసనసభలో సమైక్య రాష్ట్రం తీర్మానం చేయాలని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యులు శాసనసభ సెక్రటరీకి ప్రైవేట్‌మెంబర్ తీర్మానాన్ని అందజేశారు. ఈ పార్టీ సభ్యులు గతంలో ఇచ్చిన నోటీసును శాసన సభాపతి తిరస్కరించిన విషయం తెలసిందే. దాంతో మరో నోటీస్ ఇచ్చారు.