తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వెళ్లిన వారిని పశువులతో పోల్చి సంతలో కొనుగోలు చేశారని చెప్పావ్...
ఆ ప్యాకేజి ఏమిటో చంద్రబాబు చెప్పాలి
ఎమ్మెల్యే నారాయణస్వామి సూటి ప్రశ్న
పుత్తూరు : తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వెళ్లిన వారిని పశువులతో పోల్చి సంతలో కొనుగోలు చేశారని చెప్పావ్... మరీ ఏపీలో మా సంత నుంచి టీడీపీలోకి వెళ్లిన నాలుగు పశువులకు ఎంత మేతేశావ్ (కొన్నావ్).. అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణస్వామి ప్రశ్నించారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుత్తూరులోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని ఆరోపించారు. ఆకర్ష్ పేరుతో ఎంత ప్యాకేజి ఇచ్చారనేది చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్యాకేజీలకు ఆశ పడ్డారని చెప్పిన బాబు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలకు ఏ మేరకు ప్యాకేజి ఇచ్చారనేది బయట పెట్టాలన్నారు. తెలంగాణలో ఒక్కమాట, ఏపీలో మరో మాట చెప్పడం బాబుకు అలవాటే అన్నారు. వైఎస్సార్‌సీపీ పేరుపై గెలిచి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లడం సరికాదని, వారికి దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
ఇక్కడ గెలిచి అక్కడ అధికారం, డబ్బు సంపాదనే ధ్యేయంగా పార్టీలు మారడం జన్మనిచ్చిన తల్లిని మోసం చేయడమే అన్నారు. వైఎస్సార్‌సీపీని వీడినవారు నియోజక అభివృద్ధి అని కుంటి సాకులు చెప్పడం నిస్సిగ్గుగా ఉందన్నారు. చంద్రబాబు అబివృద్ధి నిరోధకుడని ఆడిపోసుకున్న వారే నేడు ఆయనతోనే అభివృద్ధి అని ఎలా చెబుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి అంటున్న వారు రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయిస్తారా? ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తారా? లేదా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయిస్తారా? ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేయిస్తారా? అని ప్రశ్నించారు. తప్పడు వాగ్దానాల బాబును ఇకపై జనం మోసపోరని, అవి నమ్మి పార్టీని వీడిన వారికి ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిపారు.