‘దళితులపై దాడి జరిగినా స్పందన లేదు’ | Sakshi
Sakshi News home page

దళితుల గుండెల్లో వైఎస్సార్‌ ఉన్నారు : సంజీవయ్య

Published Fri, Mar 1 2019 12:16 PM

YSRCP Leader Merugu Nagarjuna Criticizes Chandrababu - Sakshi

సాక్షి, నెల్లూరు : రాపూరులో దళితులపై దాడి జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో దళిత సంక్షేమం కుంటు పడిందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ కమిషన్లను నీరు గారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌సీ కార్పోరేషన్ అవినీతి మయమైపోయిందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దళితుల తలుపులు తట్టి, వారికి సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. కీలకమైన స్థానాల్లో దళితులను నియమించకుండా వారిని అవమానిస్తున్నారని, దళితులంతా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. వైఎస్‌ జగన్‌తోనే సంక్షేమ రాజ్యం వస్తుందని అన్నారు. 

దళితుల గుండెల్లో వైఎస్సార్‌ ఉన్నారు : సంజీవయ్య
ప్రతి దళితుడి గుండెల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ్యాఖ్యానించారు. డా. బీఆర్‌ అంబేద్కర్ స్ఫూర్తితో వైఎస్సార్‌ ఎంతో మంది దళితులను ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకుల పాఠశాలలను చంద్రబాబు నీరుగారుస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రతో దళితుల కష్టాలు, వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో దళితుల సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్‌టీలు వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement