జగన్‌ సీఎం అయితే ప్రాజెక్ట్‌లు పూర్తి

YSRCP holds Training Camp for Booth Conveners in Udayagiri Merits College - Sakshi

ఉదయగిరి సస్యశ్యామలం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్‌  నాయకుడు, మాజీ ఎంపీ  మేకపాటి రాజమోహన్‌రెడ్డి  

ఉదయగిరి: సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తికావాలంటే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంం కావాలని, ఆయన ద్వారానే ఉదయగిరి ప్రాంతానికి సాగునీరు అంది, సస్యశ్యామలం అవుతుందని నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి మెరిట్స్‌ కళాశాలలో శనివారం మండల బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ఉదయగిరి మెట్ట ప్రాంతం ఎన్నో ఏళ్లనుంచి సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్, సోమశిల హైవే కెనాల్, సీతారాంసాగర్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లు మంజూరుచేశారని, ఆయన బతికుంటే ఈ పాటికి సాగునీరు అంది సస్యశ్యామలం అయ్యేదన్నారు.

 వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రజాసంకల్పయాత్ర పేరుతో 3,500 కిలోమీటర్లు ఏడాదిపాటు పాదయాత్ర సాగించి ప్రజలతో మమేకమైన నేత దేశ చరిత్రలో ఎవరూ లేరన్నారు. జగన్‌కు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని, దీనిని చూసి ఓర్వలేక సీఎం చంద్రబాబు డబ్బుతో, వివిధ రకాల బూటకపు వాగ్దానాలు, కుయుక్తులతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతవరకు చంద్రబాబు పాలన చూశారని, వైఎస్‌ జగన్‌కు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌స్థాయిలో కసరత్తు జరగాలన్నారు. ప్రతి బూత్‌ కమిటీ సభ్యులు, కన్వీనర్లు అంకితభావంతో పనిచేసి వైఎస్సార్‌సీపీ ప్రకటించిన వరత్నాలు, మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరించి పార్టీకి ఓట్లు పడే విధంగా పాటుపడాలన్నారు. 

పార్టీ అధికారంలోకొస్తే బూత్‌కమిటీ సభ్యులు, కన్వీనర్లకు సముచిత స్థానం ఉంటుందని, నా మాటగా వారికి చెప్పాల్సిందిగా జగన్‌ చెప్పారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు డబ్బుతో ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా చాలామంది పార్టీ కార్యకర్తలు అలాంటి ప్రలోభాలకు లొంగలేదన్నారు. ఒకపార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ప్రజాప్రతినిధుల పదవులు మూడు నెలల్లోపు కోల్పోయే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలన్నారు. ఉదయగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌ పాలన రావాలంటే వైఎస్‌ జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారన్నారు. మేకపాటి కుటుంబం ఎల్లవేళలా వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి విధేయతగానే ఉంటుంది తప్ప తాము పార్టీ మారే పరిస్థితే లేదన్నారు. కొంతమంది పనికట్టుకొని పార్టీ మారుతున్నారని చేస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.

 వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉండటంతో ఓటమి చెందిం దని, ఆ పొరపాటును సరిదిద్దుకునే అవకాశంతోనే బూత్‌స్థాయి కమిటీలను బలోపేతం చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రతి బూత్‌ కమిటీ కన్వీనర్లు, సభ్యులు ఒక ప్లాన్‌ ప్రకారం ప్రజల్లోకి వెళ్లి పార్టీ నాయకులు పడుతున్న కష్టాలను, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తపిస్తున్న విధానాన్ని ప్రస్తుత పాలకపక్షం చేస్తున్న మోసాలను వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేయవలసిన ఆవశ్యకత గురించి ఓటర్లకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా ఉందని, దీనిని మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరముందన్నారు. కొన్ని సర్వేలు ఇచ్చే నివేదికలే ఇందుకు నిదర్శనమన్నారు.

 ఇండియాటుడే సర్వే కూడా జగన్‌ సీఎం అవుతారని నిర్ణయించిందన్నారు. బూత్‌ కమిటీలు బోగస్‌ ఓబ్లు గుర్తించి తొలగించాలన్నారు. చంద్రబాబుకు అరెస్ట్‌ వారెంట్‌ ద్వారా లబ్ధిపొందేందుకు టీడీపీ, ఎల్లో మీడియా తీవ్ర పాట్లుపడుతున్నాయ ని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీ ఆర్‌ టీడీపీని స్థాపిస్తే..ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్న దివాలాకోరు రాజకీయ నేత చంద్రబాబు అన్నారు. పది తరాలకు సరిపోయే ప్రజల సొమ్ము ను బాబు కుటుంబం అక్రమార్జనలో సంపాదిం చిందని ఆరోపించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మొదటినుంచి అండగా నిలిచింది మేకపాటి కుటుంబమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా రాజమోహన్‌రెడ్డిని, ఎమ్మెల్యేగా చంద్రశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు.  సమావేశంలో నెల్లూరు పార్లమెంట్‌ బూత్‌కమిటీల ఇన్‌చార్జి వెంకటనారాయణరెడ్డి పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top