బూటకపు హామీలివ్వలేదు: జగన్

బూటకపు హామీలివ్వలేదు: జగన్ - Sakshi

 - అధికారం కోసం బాబు రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని అబద్ధాలాడారు

 - ఆ హామీని ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మడం వల్లే ఆయనకు అధికారం..

 - చంద్రబాబు బండారం బయటపడే సమయం దగ్గరపడింది

 - చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి

 - ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి... ఈ ఐదేళ్లలో

 కేసులు పెట్టి వేధింపులకు గురిచేసే అవకాశముంది..

 - ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా జిల్లా స్థాయి నాయకులు సైతం వెళ్లి అండగా నిలవాలి

 

 సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: ‘‘తెలంగాణ  విడిపోక ముందు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ రైతుల రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. ఒక్క మన రాష్ర్టంలోనే అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలల్లా ఇచ్చారు. రూ.87 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేస్తానని అబద్దాలాడారు. రాష్ర్టంలో కోటీ 30 లక్షల మంది మనకు ఓటు వేస్తే.. టీడీపీకి కోటీ ముప్పై ఐదున్నర లక్షల మంది ఓట్లు వేశారు. మనం చెప్పిన మాటల కంటే చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను కేవలం ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మారు. అందువలనే ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘సీఎం స్థానంలో ఒకసారి కూర్చుంటే కనీసం 30 ఏళ్ల పాటు ప్రజలకు మేలు చేయాలన్నదే నా తపన. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టే బాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాను’’ అని చెప్పారు. రాజమండ్రిలో పార్టీ సమీక్షల సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

 

 ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోనూ పోరాటం..

 ‘‘రుణ మాఫీ అబద్ధం ఆడి ఉంటే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వాడిని. అయితే మూడు నెలల్లోనే రాష్ర్ట ప్రజలే కాదు.. ఆచరణ సాధ్యం కాని ఆ హామీలు ఎందుకిచ్చారంటూ మీరు కూడా నన్ను తిట్టేవారు. ఆ పని చేయలేకనే నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను. మనం గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేసింది ఒక్క చంద్రబాబుతోనే కాదు. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తోకూడా పోరాటం చేశాం. బాబును సీఎం చేయాలని వీరంతా సర్వశక్తులూ ఒడ్డారు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల రుణమాఫీ ఒక్క బాబు వల్లే సాధ్యమని ‘ఈనాడు’లో బ్యానర్ కథనం రాస్తారు. ఇప్పుడు అదే ‘ఈనాడు’ పేపర్‌లో నాలుగు రోజుల క్రితం చూస్తే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ర్టంలో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వస్తోందని, పైగాా విభజనకు ముందు ఈ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏ విధంగా అమలు చేయగలరనే సందేహాలు ప్రజల్లో కలిగేలా కథనాలు రాస్తున్నారు.

 

 కార్యకర్తలకు అండగా నిలుద్దాం..

 ఈ నెలలోనే చంద్రబాబు బండారం బయట పడుతుంది. ఖరీఫ్ సీజన్ మొదలైంది. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ అమలవుతుందో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. ఒక్క రుణమాఫీయే కాదు.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయగలడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి. ఇందుకోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి. ఈ సమయంలో నాయకులపైనే కాదు.. కార్యకర్తలపై కూడా కేసులు పెట్టవచ్చు. వేధింపులకు గురిచేయవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై ఇటువంటి దాడులు జరిగినా ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలోని నాయకులే కాదు.. జిల్లా మొత్తం అక్కడకు వెళ్లి ఆ కార్యకర్తకు అండగా నిలవాలి.. మరోసారి అలాంటి దాడులు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడాలి.

 

 గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం..

 ఇకపై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ కమిటీలను వేయడమే కాకుండా నిరంతరం వాటి  పనితీరును మెరుగుపర్చేందుకు కృషి చే స్తాం. అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ గ్రామస్థాయిలో చర్చించి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేస్తాం.’’

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top