వైఎస్సార్‌ సీపీ పోరుబాట

YSRCP Fight with TDP illegal mining - Sakshi

టీడీపీ అక్రమ మైనింగ్‌పై యుద్ధభేరి

 చింతమనేని ఆగడాలు సాగనివ్వమంటూ హెచ్చరిక

 వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త అబ్బయ్యచౌదరి దీక్ష

 పోటీ దీక్షకు సిద్ధపడిన చింతమనేని వర్గం

 గోపన్నపాలెంలో ఉద్రిక్తత

 రెండు శిబిరాలను తొలగించిన పోలీసులు

 రాయన్నపాలెంలో దీక్ష చేపట్టిన అబ్బయ్యచౌదరి

సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీకి చెం దిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. ఎమ్మెల్యే చింతమనేని అక్రమాలు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు వైఎస్సార్‌ సీపీ నేతలు, శ్రేణులు సన్నద్ధమయ్యారు. చింతమనేని అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసిన నేతలు.. ఇక నీ ఆగడాలను సాగనివ్వమం టూ నిరసన దీక్ష చేపట్టారు. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యానికి తెరదించడంతో పాటు, చింతమనేని అక్రమ మైనింగ్‌ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం నిరాహారదీక్ష చేపట్టారు.

 తన అక్రమాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయనే భయంతో చింతమనేని అనుచరగణంతో వైఎస్సార్‌ సీపీ దీక్షను అడ్డుకునేందుకు కుటిలయత్నాలు చేశారు. వైఎ స్సార్‌ సీపీ దీక్షా శిబిరానికి సమీపంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ధర్నా చేసేందుకు శిబిరాన్ని ఏర్పా టు చేసే ప్రయత్నాలు చేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా టీడీపీ నేతలు పోటీ దీక్ష ఏర్పాటు చేయటంతో పోలీ సులు భారీ సంఖ్యలో మోహరించారు. పరిస్థితి చేయిదాటకుండా ఇరువర్గాల శిబిరాలను పోలీసులు తొలగించారు. 

రాయన్నపాలెంలో అబ్బయ్యచౌదరి దీక్ష
అక్రమ మైనింగ్‌పై యుద్ధభేరి మోగించిన సమన్వయకర్త అబ్బయ్యచౌదరి గోపన్నపాలెం నుంచి బయలుదేరి పెదవేగి మండలం రాయన్నపాలెంలో నిరాహారదీక్ష చేపట్టారు. ఇక్కడ శిబిరాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి దెందులూరు నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ మైనింగ్‌పై ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అక్రమాలపై విచారణ చేయిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

దీక్షలకు వెల్లువెత్తిన సంఘీభావం
రాయన్నపాలెంలో అబ్బయ్యచౌదరి చేపట్టిన నిరా హార దీక్షా శిబిరాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  మాజీ ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కోటగిరి శ్రీ«ధర్, చింతలపూడి, ఉంగుటూరు, కైకలూరు సమన్వయకర్తలు వీఆర్‌ ఎలీజా, పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. 

రాష్ట్రంలో దోపిడీకి సీఎం ఆద్యుడు
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌ చేస్తూ దోచుకుంటున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం శోచనీయమన్నారు. ఈ దోపిడీకి సీఎం చంద్రబాబు ఆద్యుడని, ఇసుక, మట్టి, నీరు–చెట్టు పథకాల్లో పూర్తిగా అవినీతికి పాల్పడ్డారని, గుంటూరు జిల్లా గురజాలలో నాలుగున్నరేళ్ల నుంచి వందల కోట్ల విలువైన సున్నపు రాళ్లు అక్రమంగా తరలించారని గుర్తుచేశారు. హైకోర్టు సైతం ఆక్షేపించి చర్యలు తీసుకోమని ఆదేశించినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. ఎన్ని పోరాటాలకైనా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి అక్రమ మైనింగ్‌ చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌ను, ఆయనకు సహకరిస్తున్న అధికారులను దోషులుగా నిలబెడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు.

చింతమనేని దౌర్జన్యాలు సిగ్గుచేటు
ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాలు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమ  కేసులు దోపిడీలపై పలుమార్లు కలెక్టర్‌కు వినతుల అందజేసినా కనీసం స్పందించకపోవడం వారి భాగస్వామ్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. 

ఉద్యమం ఆగదు
నిరాహార దీక్షకు దిగిన అబ్బయ్యచౌదరి మాట్లాడు తూ చింతమనేని ప్రభాకర్‌కు భయపడే రోజులు పో యాయన్నారు. అక్రమ మైనింగ్‌ను నిలువరించే వర కూ ఉద్యమం చేస్తానని ప్రకటించారు. చింతమనేని అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.  ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, పార్టీ బీసీసెల్‌ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top