నేడు, రేపు రోడ్ల దిగ్బంధం

నేడు, రేపు రోడ్ల దిగ్బంధం - Sakshi


సమైక్యంపై కేంద్రానికి, జీవోఎంకు కనువిప్పు కోసమే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి వెల్లడి

ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపు

నేడు, రేపు ప్రయాణాలు మానుకోవాలని వినతి

కాంగ్రెస్, టీడీపీలు డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని ధ్వజం

పదవి కోసం ప్రజల భవితను కిరణ్ తాకట్టు పెడుతున్నారని విమర్శ


 

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రజాకాంక్షను ఢిల్లీ పెద్దలకు తెలియజేసేందుకు బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందనిపార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి తెలిపారు. విభజన విధివిధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం గురువారం సమావేశం కానున్నందున వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం విలేకరుల భేటీలో వెల్లడించారు. ‘రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో అంతా భాగస్వాములు కావాలి. ప్రయాణాలను వాయిదా వేసుకుని సహకరించాలి’ అని కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్‌సీపీ చేస్తున్న కృషిని వివరించారు. ‘‘ఇప్పటిదాకా 9,360 గ్రామ పంచాయతీల్లో సమైక్య తీర్మానాలు చేసి ప్రధానికి, జీవోఎంకు ఇ-మెయిళ్ల ద్వారా పంపించాం. రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సీనియర్ నేతలంతా వెళ్లి కలిసి రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను వివరించారు. హేతుబద్ధత లేకుండా, సంప్రదాయాలకు భిన్నంగా, ఏకపక్షంగా, ప్రజా వ్యతిరేకంగా కేంద్రం తలపెట్టిన విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని విన్నవించాం’’ అని గుర్తు చేశారు.

 

 రాష్ట్రపతిని కలవలేదేం బాబూ?

 ప్రజలను మోసగిస్తూ కాంగ్రెస్, టీడీపీలు డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నాయని శోభ దుయ్యబట్టారు. యాత్రలు, దీక్షల పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎవరికీ అనుమానం రాకుండా సోనియా నిర్ణయాన్ని చాలా చక్కగా సీఎం కిరణ్ నెరవేరుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ గగ్గోలు పెట్టిన బాబు, ఆయన హైదరాబాద్ వచ్చినా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. దీంతో బాబు నైజం మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షనేతగా ఉండి ప్రజల మనోభావాలను రాష్ట్రపతి దృష్టికి బాబు తీసుకెళ్లలేదేం? ఆయన ఢిల్లీలో నిరాహారదీక్ష దేని కోసం చేశారు? ఏ డ్రామా ఆడటానికి చేశారు? ఒకపక్క సీమాంధ్ర టీడీపీ నేతలు విభజనను ఆపాలంటారు. మరోపక్క తెలంగాణ టీడీపీ నేతలు సీమాంధ్ర నేతలపై బాబుకు ఫిర్యాదు చేశామని మీడియాకు చెబుతారు. అసలు టీడీపీ నేతలు ఏమనుకుంటున్నారు? ప్రజలను అమాయకులుగా భావిస్తున్నారా? వీరి డ్రామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. రెండుసార్లు ఓడిపోయినా కూడా సిగ్గురాలేదా’ అని శోభ నిప్పులు చెరిగారు.

 

 సోనియా డెరైక్షన్‌లో కిరణ్ డ్రామాలు

 సమైక్య ముసుగులో సోనియా ఆదేశాల మేరకు విభజన సంబంధిత సమాచారమంతటినీ కేంద్రానికి కిరణ్ అందజేస్తున్నారన్నారు. ‘‘ఆయన నిజంగా సమైక్యవాదే అయితే ఆ సమాచారాన్ని ఎందుకిస్తున్నట్టు? ఎలాంటి సహకారమూ, సమాచారమూ ఇవ్వబోనని కేంద్రానికి ఎందుకు గట్టిగా చెప్పడం లేదు?’’ అని ప్రశ్నించారు. మూడు నెలల పదవి కోసం ప్రజల భవితను కిరణ్ తాకట్టు పెడుతున్నారన్నారు. ‘‘మేం మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న మేరకు అసెంబ్లీలో ఎందుకు తీర్మానం పెట్టడం లేదు? వారానికో ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఏమైనా చేశారా? అసెంబ్లీ తీర్మానం యావద్దేశం దృష్టినీ ఆకర్షించవచ్చని మేమెంతగా కావాలనే కిరణ్ పెడచెవిన పెట్టారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఆ ప్రక్రియ ప్రారంభం కాకముందే కేంద్రానికి గట్టి సందేశం ఇవ్వలేని నిస్సహాయ స్థితికి సీమాంధ్రను నెట్టేశారు’’ అంటూ తూర్పరాబట్టారు.విభజనను ఆపడానికి సీఎంగా ఏ చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top