వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు...
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం శనివారం విజయవాడలో జరగనుంది. కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రసాదరాజు ఈ సమావేశానికి హాజరవుతారు. వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారు.
ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటవ తేదీల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించతలపెట్టిన దీక్షను విజయవంతం చేయడానికి త్రిసభ్య కమిటీ వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 11 గంటలకు నగరంలోని సత్యనారాయణపురంలో ఉన్న నాడార్ కల్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరు సాగించేందుకు కూడా పార్టీ క్యాడర్‌ను ఈ సమావేశంలో సమాయత్తం చేస్తారు.
నేడు విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం
త్రిసభ్య కమిటీ సమావేశానికి ముందు వైఎస్సార్ సీపీ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.