ఇప్పటికైనా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకపోతే తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని..సీఎం కిరణ్, చంద్రబాబులను ఉద్దేశించి వైఎస్‌ఆర్‌సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు.
ఒంగోలు, న్యూస్‌లైన్: ఇప్పటికైనా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనకపోతే తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని..సీఎం కిరణ్, చంద్రబాబులను ఉద్దేశించి వైఎస్‌ఆర్‌సీపీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు. 135రోజులుగా సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమం వెలకట్టలేనిదన్నారు. రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ యువజన విభాగం గురువారం నగరంలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ముందుగా విద్యార్థి నాయకులు, పలువురు పార్టీ నాయకులు శ్రీహర్షిణీ డిగ్రీ కాలేజీవరకు ప్రదర్శన నిర్వహించారు. కాలేజీని మూసివేయించిన అనంతరం నగరంలోని విద్యాసంస్థల వద్దకు చేరుకున్నారు. విద్యాసంస్థలన్నీ సహకరించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రతి పార్టీకి చెందిన నాయకులు భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాదును వదులుకోవడం జరిగే పని కాదన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఎన్నిరకాల ప్రయత్నాలు జరిపినా అడ్డుకోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. కేవలం ఏదో ఒక విధంగా ప్రాంతం విడిపోవాలనే కోరికే తప్ప అభివృద్ధి అడుగుంటిపోతుందనే ఆలోచనే కాంగ్రెస్, టీడీపీలకు లేకపోవడం బాధాకరమన్నారు.
విద్యార్థి విభాగం నగర కన్వీనర్ అమర్నాథరెడ్డి మాట్లాడుతూ సీఎం.. సోనియా జపం వదలాలని సూచించారు. ప్రజాసమస్యలపై గళం విప్పాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో శాసనసభకు సైతం డుమ్మా కొట్టి స్వార్థరాజకీయాలను నడపడం దారుణమన్నారు. బంద్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాకా శివారెడ్డి, రమేష్‌రెడ్డి, నాని, బాలాజీ, అశోక్ పాల్గొన్నారు.