అదే నినాదంతో తెలంగాణలోకి వెళ్తాం: జగన్

అదే నినాదంతో తెలంగాణలోకి వెళ్తాం: జగన్ - Sakshi


హైదరాబాద్: రాష్ట్రాన్ని విడగొట్టినా, తెలుగు జాతిని మాత్రం విడగొట్టలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోకూడా వైఎస్సార్‌సీపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజన్న రాజ్యంకోసం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.  వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన రెండు శిక్షణా శిబిరంలో బుధవారం వైఎస్ జగన్ కీలక ఉపన్యాసం చేశారు. ఆయన మాటల్లోనే...''రాష్ట్రాన్ని విడగొట్టి.. భావోద్వేగాలను సొమ్ముచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య ఎన్నికలకు వెళ్తున్నాం. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉంటేనే మేలు జరుగుతుంది. ప్రతిపక్షం, అధికారపక్షం కుమ్మక్కైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కలిపి ఉంచలేకపోయాం. రాష్ట్రాన్ని విడగొట్టాం... పెద్దమ్మను నేను అని ఒకరు, చిన్నమ్మను నేనని మరొకరు ఓట్లు అడిగే పరిస్థితి. రాష్ట్రాన్ని విడగొట్టాం కాబట్టి పొత్తు, లేదా విలీనం చేయండని ఇంకొకరు అడిగే పరిస్థితి. నా లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టారంటూ విజయోత్సవాలు జరుపుకోమని ఇంకొకరు చెప్పే పరిస్థితి. ఫలానా మంచి పనులు చేసి ఓట్లడిగే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదు. రాజన్న రాజ్యాన్ని తూట్లు పరుస్తూ ఐదేళ్లు పాలించారు. అడ్డగోలు విభజనలో భాగస్వాములైన కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్‌ఎస్‌లది ఒకే రకమైన వైఖరికాదా?ప్రజలగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఈ పార్టీలు రాజకీయాలు చేయడంలేదు. రాష్ట్రాన్ని విడగొట్టారు.. భూములైతే వేరు చేశారు.. తెలుగు జాతిని మాత్రం వీరు విడగొట్టలేరు. తెలుగువారు ఎక్కడున్నా.. వారి మనసులు, వారి ఆప్యాయతలు వీరువిడగొట్టలేరు. సమైక్యమన్న విధానాన్ని వైఎస్సార్‌సీపీ ఎంచుకుంది. సమైక్య మంటే.. తెలంగాణలో కూడా అన్నదమ్ములున్నారని, రాయసీమలో కూడా అన్నదమ్ములున్నారని, కోస్తాలో కూడా అన్నదమ్ములున్నారని అర్థం. సమైక్యమంటే తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తాంధ్రనాది అన్న భావనే. ప్రేమ, ఆప్యాయతలు అక్కడా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి అని చెప్పడమే సమైక్యం. ఇదే నినాదంతో తెలంగాణలోకి కూడా వెళ్తాం. తెలంగాణలో కూడా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తుంది. ప్రతి పేదవాడి గుండెచప్పుడు వినడానికి, వారి మనసు తెలుసుకోవడానికి కృషిచేస్తుంది. మరణాంతరం కూడా ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోవడానికి కృషిచేస్తుంది' అని జగన్ తన ప్రసంగం ముగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top