పులివెందులలో ప్రగతి పరుగు

YS Rajasekhara Reddy son YS Jagan Also Seems To Have Taken A Particular Interest In The Development Of The Constituency - Sakshi

నియోజకవర్గ అభివృద్ధికి పాడా ఏర్పాటు 

రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 

పాడా చైర్మన్‌గా కలెక్టర్‌ హరికిరణ్‌  

దేశ, రాష్ట్ర రాజకీయాలలో పులివెందులకు ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి, తనయులను ముఖ్యమంత్రులుగా పంపిన ఘన చరిత్ర పులివెందుల ప్రాంతానిది. నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానికి పులివెందుల కంచుకోట. అలాంటి పులివెందుల ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏ అవకాశాన్ని వైఎస్‌ కుటుంబం వదులుకోలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారికి గుర్తుకు వచ్చేది వైఎస్‌ కుటుంబమే. వైఎస్‌ కుటుంబీకులు ‘మేమున్నామంటూ’ వారి సమస్యలను తీరుస్తున్నారు.

సాక్షి, పులివెందుల: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పులివెందుల అభివృద్ధి పరుగు పెట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కనీస మౌలిక వసతుల కల్పన కోసం పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) ఏర్పాటు చేసి, అందుకు పాడా ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ (ఓఎస్డీ) అధికారిని నియమించడం జరిగింది. కేవలం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి  ప్రగతి పనులు చేపట్టారు. అప్పట్లో దాదాపు రూ.200 కోట్ల నిధులు కేటాయించి, అభివృద్ధికి కృషి చేశారు.  వైఎస్సార్‌ హయాంలో పాడా నిధుల ద్వారా తాగునీటి పథకాలు, సిమెంటు రోడ్లు, పాలశీతలీకరణ కేంద్రాలు, డ్రైనేజీ, వ్యవసాయ కార్యాలయ భవనాలు, బస్‌ షెల్టర్లు, కళాశాలల ప్రహరీ నిర్మాణాలు, పాఠశాలలకు ఫర్నీచర్‌ వంటి పనులు చేపట్టారు. వైఎస్సార్‌ మరణం తర్వాత పాడా నిధులు ఆగిపోవడం జరిగింది.

వైఎస్‌ జగన్‌ సీఎం కావడంతో..
వైఎస్సార్‌ మరణం తర్వాత పులివెందుల ప్రాంత అభివృద్ధి దాదాపు ఆగిపోయిందని చెప్పవచ్చు. వైఎస్సార్‌ మరణానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు పులివెందుల ప్రాంతానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. వైఎస్సార్‌ తలపెట్టి, 90 శాతం పూర్తి చేసిన పథకాలకు అరకొర నిధులు మంజూరు చేసి అంతా తామే చేసినట్లుగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెట్టనుంది. 

పాడా చైర్మన్‌గా కలెక్టర్‌ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) చైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధికి ఎలాంటి పనులు, ఏ పనులు చేపట్టాలి వంటి విషయాలను కలెక్టర్‌ పర్యవేక్షిస్తారు. త్వరలోనే అందుకు సంబంధించిన ప్రగతి పనులు మొదలు కానున్నాయి. 

రూ.100 కోట్ల కేటాయింపు
ఇటీవల 2019–20కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇందులో పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ పేరుతో పులివెందుల ప్రాంత అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించారు. దీంతో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధికి వైఎస్సార్‌ తరహాలోనే తనయుడు వైఎస్‌ జగన్‌ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పులి వెందుల ప్రాంత అభివృద్ధికి త్వరలోనే ప్రత్యేక అధికారిని నియమించి అం దుకు తగిన కార్యాలయం, సిబ్బందిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ప్రత్యేక నిధుల ఏర్పాటుతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కనీస మౌలిక వసతులతోపాటు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే సమాచారం ఇవ్వాల్సిందిగా అధికారులను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరి నట్లు సమాచారం. పులివెందుల ప్రాం తానికి ప్రత్యేక నిధులు కేటాయించడం పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top