నాడు కల.. నేడు నిజం

YS Rajasekhara Reddy did the irrigation projects to materialize - Sakshi

కాగితాలకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టులకు కార్యరూపం ఇచ్చిన మహానేత వైఎస్‌ 

కేవలం ఐదేళ్లలో 16 ప్రాజెక్టులు పూర్తిగా, 25 పాక్షికంగా పూర్తి చేసిన వైనం 

18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 2.07 లక్షల ఎకరాల స్థిరీకరణలో రికార్డు 

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నాలను సాకారం చేయడానికి 2004లో ముందు చూపుతో చేపట్టిన జలయజ్ఞం ఫలాలు నేడు ప్రజలకు చేరువయ్యాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు తోటపల్లి, వంశధారతో దన్నుగా నిలిస్తే దుర్భిక్ష రాయలసీమకు హంద్రీ–నీవా, గాలేరు–నగరితో ఊపిరి పోశారు. పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతో కృష్ణా, గోదావరి డెల్టాలనే కాదు.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ప్రణాళిక రచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 2004లో రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ లేదు. కానీ.. రూ.1,33,730 కోట్ల అంచనా వ్యయంతో 86 సాగునీటి ప్రాజెక్టులను ఒకేసారి చేపట్టారు. వాటిని పూర్తి చేయడం ద్వారా 1.21 కోట్ల ఎకరాలకు నీళ్లందించడానికి పక్కాగా ప్రణాళిక రచించారు.

ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి 16 ప్రాజెక్టులను పూర్తి చేశారు. మరో 25 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి 18.48 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 2.07 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమ ప్రజల దశాబ్దాల కల హంద్రీ–నీవా, గాలేరు–నగరిలను 2004లో చేపట్టి, 2009 నాటికి తొలి దశ పూర్తి చేశారు. రెండో దశ పనులను కూడా ఓ కొలిక్కి తెచ్చారు. ప్రస్తుతం గాలేరు – నగరి కాలువ ద్వారా గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్‌లకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. హంద్రీ–నీవా ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు.  

వైఎస్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు  

ముందు చూపుతోనే నేడు సాగు నీరు 
కృష్ణా డెల్టా ప్రజల తొమ్మిది దశాబ్దాల కల పులిచింత ప్రాజెక్టును 2009 నాటికే పూర్తి చేశారు. ప్రస్తుతం పులిచింతలో 44 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా ఆయకట్టుకు నీటి కొరత లేకుండా చూడటానికి ఆ మహానేత ముందుచూపే కారణం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వంశధార, తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల కింద భారీ ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తున్నారు. తెలుగు ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన అన్ని అనుమతులు సాధించి.. 2004లో పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువ పనులను సింహభాగం పూర్తి చేశారు. హెడ్‌ వర్క్స్‌కు అవసరమైన భూమిని అత్యధిక భాగం సేకరించారు. ఆ ప్రాజెక్టును కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత హఠన్మరణం చెందారు. ఆ మహానేత తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కాగా ప్రణాళిక రచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top