ఆడపడుచులకు చేయూత

YS Jaganmohan Reddy Gave Guarantees To Womens By YSR Cheyutha Scheme - Sakshi

సాక్షి, బాపట్ల : తరాలు మారినా.. తలరాతలు మారని పరిస్థితి వారిది. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు ఆయా కులవృత్తుల్లో నిమగ్నమైన జీవనాన్ని గడుపుతూ జీవిస్తుంటారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు ఎందరొచ్చినా వీరి జీవనస్థితిలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా పోతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు నిజజీవితంలో మాత్రం వాటిని ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనుచూపుమేరల్లో కనిపించడం లేదు.

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకింగ్‌ కోసమే ఉపయోగించుకునే టీడీపీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పేదల అభ్యున్నతి కోసం మేము కట్టుబడి ఉన్నాం.. పేదలకు అన్నివిధాల అండగా ఉంటామంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఐదేళ్లు గడిచేంతవరకు ఏ నాడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.

బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద 45 ఏళ్లకే పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తామని, నాలుగేళ్లలో మహిళలకు రూ.75 వేలు వివిధ కార్పొరేషన్‌ల ద్వారా ఉచితంగా ఇస్తానని ప్రకటించడంతో మహిళాలోకం ఆనందంగా ఉంది.

కష్టపడినా ఫలితం శూన్యం
ఏళ్ల తరబడి బుట్టల అల్లికే ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేదలు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయాల వల్ల పూట గడవని స్థితిలో ఆకలి కేకలతో ఆలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కనీసం ఆదిశగా ఆలోచించకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్డాడుతున్నారు.

బాపట్ల మండలంలోని కనకాద్రినగర్, కర్లపాలెం మండలంలోని ఎస్టీకాలనీ, పిట్టలవానిపాలెం మండలంలోని కాలువకట్టపై జీవనం సాగించే  ఎస్టీలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్న ఎస్టీలకు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి బుట్టల అల్లిక. వీరంతా సూర్యలంక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈత చెట్లను పాడుకొని ఈత సువ్వలను కోస్తారు. కోసిన  ఈత సువ్వలను 15 రోజులు ఎండిన తర్వాత వాటిని  ఇంటికి చేర్చుకుని బుట్టల అల్లిక ప్రారంభిస్తారు.

రోజంతా భార్య, భర్త కలిసి 4 బుట్టలు మాత్రమే అల్లుతారు. వాటిని మార్కెట్‌లో విక్రయిస్తే రూ. 120 నుంచి 150 వరకు వస్తాయి. వాటితోనే కుటుంబం మొత్తం పోషించుకోవాలి. గతంలో ఏ గ్రామానికి బుట్టలు తీసుకెళ్లినా వెంటనే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ప్లాస్టిక్‌ వస్తువులు విరివిగా వాడుకలోకి రావడంతో ఈత సువ్వలతో తయారుచేసిన బుట్టలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకురావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎదుగు బొదుగు లేని బీసీ బతుకులు
ఇదిలా ఉండగా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తాం. ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలను మరిచారు. కనీసం 120 పైగా కులాలు ఉన్న బీసీల అభ్యున్నతి గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు. బీసీల్లో ప్రధాన కులాలు అయిన యాదవులు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రేంతవరకు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కనీసం వారికి సబ్సిడీపై గొర్రెలను అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా గౌడ కులస్తులకు ఏళ్ల తరబడి కల్లుగీతనే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగానే మారింది. నాయీబ్రహ్మణులు, రజకులు, వడ్డెర, పద్మశాలీలు, విశ్వబ్రహ్మణులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఏం చేయని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మరోసారి బీసీలను మోసగించే ప్రయత్నానికి తెరలేపారు. 

పేదలకు మేలు చేసే పథకం 
వైఎస్సార్‌ చేయూత  పథకం ద్వారా  పేదలు ఆర్థికంగా చేయూత అందుతుంది. కనీసం పూటగడవని నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలకు 45 సంవత్సరాలకే పింఛన్‌ సౌకర్యం కల్పించేవిధంగా హామీ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. దేశ చరిత్రలో మరెవ్వరూ ఇవ్వనటువంటి హామిను ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడనే నమ్మకం ఉంది.
-నర్రా ధనలక్ష్మి, మంతెనవారిపాలెం 

మహిళలకు ఆర్థిక భరోసా
వైఎస్సార్‌ చేయూత పథకం మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల్లోని మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. 
-మద్దికర ఝాన్సీలక్ష్మి, భవనంవారిపాలెం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top