అప్రమత్తంగా ఉందాం 

YS Jaganmohan Reddy Comments On Covid-19 Prevention - Sakshi

అధికారుల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను అందరం కలిసి కట్టుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, వైద్య నిపుణులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ను నిరోధించడానికి చేపడుతున్న చర్యల గురించి ఆయన ఆరా తీశారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అందరం కలిసి బలంగా ఈ సమస్యను ఎదుర్కోవాలన్నారు.

ప్రతి ఒక్కరూ వారి గురించి జాగ్రత్తలు తీసుకుంటూనే, చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేయాలని కోరారు. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పటిష్టమైన వైద్య, ఆరోగ్య, అధికార యంత్రాంగం అందుబాటులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఈ వైరస్‌ విస్తరించకుండా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా పని చేస్తోందని సీఎం వివరించారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూను పాటించాలన్న ప్రధాన మంత్రి విన్నపానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ, ఆరోగ్య శాఖ అధికారులు, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డా.చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ సాంబశివారెడ్డి పాల్గొన్నారు.  

కజకిస్థాన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను కాపాడండి 
కజకిస్థాన్‌లోని అల్మాటిలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. వారిని క్షేమంగా తీసుకురావడానికి ప్రయత్నించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కజకిస్థాన్‌లో భారత రాయబారితో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాష్‌ సంప్రదింపులు జరిపారు. హాస్టల్స్‌ మూసి వేయడం, విమాన రాకపోకలపై ఆంక్షల కారణంగా నెలకొన్న పరిస్థితులను ప్రవీణ్‌ప్రకాష్‌ ఆయనకు వివరించారు. విద్యార్థులకు తగిన విధంగా సహాయం చేస్తామని కజకిస్థాన్‌ భారత రాయబారి హామీ ఇచ్చారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top