ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా.. అయినవాడిలా, ఆత్మీయునిలా ‘నేనున్నా’నంటూ వచ్చి, మనోధైర్యాన్నిచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా.. అయినవాడిలా, ఆత్మీయునిలా ‘నేనున్నా’నంటూ వచ్చి, మనోధైర్యాన్నిచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో మరోమారు పర్యటించి.. వివిధ సందర్భాల్లో బాధితులైన వారి కన్నీరు తుడిచారు. 28 మత్స్యకార, తొమ్మిది గిరిజన కుటుంబాలను పరామర్శించారు. రెండు రోజుల పాటు పగలనక, రాత్రనక బాధిత కుటుంబాలను అనునయించారు. దారిపొడవునా ప్రజల అభిమానం వెల్లువలా అడ్డుపడడంతో ఆయన పర్యటన చాలా ఆలస్యంగా నడిచింది. బాధితులకు బాసట, ఆపన్నులకు ఊరటగా నిలిచే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురు, శుక్ర, శనివారాల్లో జిల్లాలో పర్యటించారు. మొదటి రోజు గురువారం తుని, పిఠాపురం నియోజకవర్గాల్లో బాధిత మత్స్యకార కుటుంబాలకు భరోసా కల్పించిన జగన్ రెండో రోజు శుక్రవారం కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో బాధిత మత్స్యకార కుటుంబాలను ఓదార్చారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక శనివారం తెల్లవారుజాము వరకూ ఆయన ఏజెన్సీలో వ్యాన్ ప్రమాద బాధితులైన గిరిజనులను పరామర్శించారు. ఇటు మైదాన ప్రాంతంలో, అటు మన్యంలో సైతం జగన్ నేరుగా బాధితుల ఇళ్లకు వెళ్లడమే కాక ఒక్కో ఇంటిలో నేలపై చాపలపైనే కూర్చుని అరగంట పాటు బాధిత కుటుంబాలను అనునయిస్తూ ఓ ఇంటి పెద్ద మాదిరి ఓదార్చారు. ఆయన పలుకులతో వారికి కొండంత ధైర్యం వచ్చింది.
అడుగడుగునా పోటెత్తిన ప్రజాభిమానం
మూడు రోజుల పర్యటనలో జిల్లాలో 185 కిలోమీటర్లు పర్యటించిన జగన్ సముద్రంలో వేటకు వెళ్లి మృతిచెందిన బాధిత మత్స్యకార కుటుంబాలను ఓదార్చారు. మరోవైపు రంపచోడవరం ఏజెన్సీలో పెళ్లి వ్యాన్ బోల్తాపడి మృతి చెందిన తొమ్మిది మంది గిరిజనుల కుటుంబాలను పరామర్శించారు. గురువారం సాయంత్రం ఐదు గంటలకు తుని నుంచి జగన్ జిల్లా పర్యటన మొదలై శనివారం ఉదయం రాజమండ్రితో ముగిసింది. మత్స్యకారులు అధికంగా నివసించే తుని నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామం పెరుమాళ్లపురం సెంటర్‌లో జరిగిన సభలో కాకినాడ సెజ్ రైతులకు జగన్ భరోసా కల్పించారు. ఇక భూములు రావని, పరిహారం కూడా పెంచేదిలేదని తెగేసి చెప్పిన ప్రభుత్వానికి జగన్ హెచ్చరికలతో కదలిక వస్తుందని సెజ్ రైతులు ఆశిస్తున్నారు. మునుపెన్నడూ ఈ రకమైన స్పష్టమైన హామీ ఏ ఒక్క నేత నుంచి రాలేదంటున్నారు. సేకరించిన భూముల్లో ఎకరానికి రూ.75 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌ను జగన్ తెరమీదకు తేవడం సెజ్ రైతుల్లో భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించింది. వారంతా ఒక్కసారిగా చప్పట్లతో జై జగన్ అంటే నినదించారు.జనం జగన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎగబడటంతో సుమారు 75 కిలోమీటర్ల పర్యటనకు 7.30 గంటల సమయం పట్టింది.
ఏ వేళనైనా అభిమాననేత కోసం అదే నిరీక్షణ
అదే రోజు పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంతం యు.కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేసరికి రాత్రి 12.18 గంటలైంది. రెండవ రోజు శుక్రవారం జగన్ కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఓదార్చారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఏజెన్సీ గంగవరం మండలం సూరంపాలెం చేరుకోవాల్సి ఉండగా వెల్లువలా పోటెత్తిన జనాభిమానంతో 12 గంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. దారి పొడవునా జగన్‌కు ఘన స్వాగతం లభించింది.
కార్యకర్తలకు నూతనోత్తేజం
కాకినాడ నుంచి శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొత్తాడ చేరుకున్న జగన్ పెళ్లి వ్యాన్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంత ఆలస్యమైనా సూరంపాలెం సభాస్థలికి వచ్చి, పోలవరం ముంపు మండలాలు, రంపచోడవరం నియోజకవర్గం ఇతర మండలాల నుంచి అక్కడికి వచ్చిన గిరిజనులను పలకరించనిదే ముందుకు పోయేదిలేదని చెప్పారు. తరువాత ఆ ప్రాంత నేతలకు ఇచ్చిన మాట మేరకు ఓదార్పులు పూర్తిచేసి శనివారం తెల్లవారుజామున పర్యటనను ముగించారు. ఆయన ఎంత ఆలస్యంగా తమను చేరుకున్నా.. ఆయనను చూడగానే గిరిజనుల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. సమయం ఎంతైనా ఏ మాత్రం తొందరపాటు లేని జగన్.. తన కోసం పిల్లలతో కలిసి వేచి ఉన్న వందలాది మంది గిరిజనులను చూసి చలించిపోయారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయంటూ ఆయన చేసిన ప్రసంగం వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఆ నియోజకవర్గ సమన్వయకర్త అనంతబాబుపై పోలీసులు నమోదు చేస్తున్న కేసులు విషయంలో ఆయనతో పాటు పార్టీని నమ్ముకుని జెండాలు చేతపట్టి ముందుకు వచ్చిన వారందరికీ భవిష్యత్‌పై ఆశలు రేకెత్తించారు. త్వరలో ముంపు మండలాల్లోనూ పర్యటిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చి వెళ్లారు. చివరకు శనివారం తెల్లవారుజామున ఏజెన్సీ నుంచి సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయం 5 గంటలకు రాజమండ్రి చేరుకున్న జగన్ కేవలం 4గంటలు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పశ్చిమ గోదావరి పర్యటనకు బయల్దేరి వెళ్లారు.