అబద్ధపు హామీల బాబును ఎండగడదాం! : వైఎస్ జగన్‌ | Ys Jagan mohan reddy slams Chandrababu Naidu's False assurances | Sakshi
Sakshi News home page

అబద్ధపు హామీల బాబును ఎండగడదాం! : వైఎస్ జగన్‌

Nov 25 2014 1:46 AM | Updated on Jul 25 2018 4:07 PM

అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబును ఎండగడదాం...

* ప్రజలకు అండగా నిలుద్దాం: జగన్ పిలుపు
* ఆరునెలల్లోనే టీడీపీ సర్కారుపై ప్రజల్లో నిరసన
* ప్రతిపక్షంగా చంద్రబాబు మోసాలను ఎండగడదాం
* వచ్చే నెల 5న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేద్దాం
* ప్రకాశం జిల్లా సమీక్షలో తొలిరోజు ఐదు నియోజకవర్గాల నేతలతో భేటీ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబును ఎండగడదాం... టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలైపై ఉద్యమిద్దాం... మనకు ఓట్లేసిన ప్రజలకు అండగా నిలుద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఐదో తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరా రు. పార్టీని గ్రామస్థాయివరకూ బలోపేతం చేయడమే లక్ష్యంగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించారు.  తొలిరోజు కందుకూరు, అద్దంకి, సంతనూతల పాడు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు చెప్పిన విషయాలను జగన్ ఆసాంతం విన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలను కలసికట్టుగా ఎదిరిద్దామంటూ మనోధైర్యం నింపారు. ఇంకా ఆయనేమన్నారంటే...

- ఏ ప్రభుత్వానికైనా ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకోవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఆరు నెలలు తిరగకుండానే చంద్రబాబు మాకు వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేక పవనాలు వీచిన రాష్ట్రం దేశంలోనే లేదు. మనంకూడా ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉంది.
 
 - మన పార్టీ అధికారంలోకి వస్తే 30 ఏళ్లపాటు ప్రజలకు గుర్తుండిపోయేలా పాలన అందించాలనుకున్నాను. నాన్న ఫోటో పక్కన ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా ఉండాలని భావించాను. అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేదు. అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే చంద్రబాబు ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఆయన ఎలా మోసం చేసాడో చెబుతాడు.

- 2012 కడప పార్లమెంట్ ఎన్నికలో నేను పోటీ చేసినపుడు నాకు వచ్చిన మెజారిటీ 5.45 లక్షలు. గత ఎన్నికల్లో చంద్రబాబుకూటమికి, మనకు ఓట్ల తేడా కేవలం ఐదు లక్ష లు. రాష్ట్రవ్యాప్తంగా చూసినపుడు ఇది పెద్ద తేడా కాదు. చంద్రబాబు ఇచ్చినట్లుగా మనంకూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక్క కోరికతో అడ్డమైన అబద్ధాలు చెప్పిన ఘనత చంద్రబాబునాయుడిదే.
 
రుణమాఫీకి రూ.5 వేల కోట్లా?
 - రైతు రుణమాఫీకి బడ్జెట్‌లో కేవలం రూ. ఐదు వేల కోట్లు కేటాయించారు. దీంతో 20 శాతం రుణం మొదటి దశలో మాఫీ చేస్తానని చెప్పారు. రైతుల రుణాలు 87 వేల కోట్లుంటే, డ్వాక్రా రుణాలు 14 వేల కోట్లున్నాయి. మొత్తం కలిపితే రూ.1.01 లక్షల కోట్లు. చంద్రబాబుమాట విని రైతులు వడ్డీలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ 14 శాతం కింద మరో రూ.14 వేల కోట్ల భారం పడింది. ఈ ఏడాది ఐదు వేల కోట్లే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో వచ్చే ఏడాదికి ఈ వడ్డీ 28 వేల కోట్లకు చేరుతుంది. అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీ కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది.
 
 - తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, జాబు రావాలంటే బాబు రావాలని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తానని పెద్దపెద్ద కటౌట్లు, లైట్లు పెట్టి రాష్ట్రమంతా ఊదరగొట్టారు. ఇదే విషయాన్ని  అసెంబ్లీలో నిలదీస్తే తాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనలేదని, ప్రైవేటు ఉద్యోగాలు వస్తాయని చెప్పానని దాటవేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే సీఎంతో పనేంటి?
- గ్రామాల్లో అవ్వా తాతల పెన్షన్ల విషయంలో కూడా మోసం చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 11 వేల పెన్షన్లున్నాయి. వాటిని వెయ్యి రూపాయలు చేస్తే నెలకి రూ.431 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.3,700 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే కేవలం రూ.1,338 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టారు. అంటే అవ్వా తాతల పెన్షన్‌లో కూడా రూ.2,400 కోట్లు కోత వేశారు. అసలు ఈ మనిషికి మానవత్వం ఉందా?
 
ఈ పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీ9 భాగస్వామ్యం
- ఇంత మోసం చంద్రబాబు ఒక్కడే చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలిసి ఈ మోసపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఐదేళ్ల తర్వాత కూడా వీరు చంద్రబాబును మోస్తారు. చంద్రబాబు మంచివాడే, ఆర్‌బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తారు. చంద్రబాబు మాది రిగా మనకు తోడుగా మోసపూరిత పత్రికలు, ఛానళ్లు లేవు. అయినా మనకు ఉన్నది చంద్రబాబుకు లేనిది దేవుని దయ. దేవుడు ఇంతమంది ప్రజల్లో పుట్టించిన ప్రేమానురాగాలను తోడుగా తీసుకుని రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు వెళ్తాం. చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని ప్రజలకు చెబుదాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement