వైఎస్‌ జగన్‌: కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష | YS Jagan Review Meeting Over CoronaVirus Preventive Measures - Sakshi
Sakshi News home page

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

Published Sat, Apr 18 2020 3:16 PM

YS Jagan Mohan Reddy Review Meeting On Covid 19 Preventive Measures - Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు పాటిస్తున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పడు సమీక్ష చేపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో మరో 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులను మరింత అప్రమత్తం చేశారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ వంటి అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌-19 నివారణా చర్యలపై సీఎం జగన్ వారితో చర్చించారు. వినూత్న మార్కెటింగ్‌ విధానాలపై మార్కెటింగ్‌శాఖ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. రూ.100లకు అయిదు రకాల పండ్ల పంపిణీ బాగుందని సీఎం ప్రశంసించారు. (‘నాడు–నేడు’కు రూ.1,350.33 కోట్లు )

కరోనా నియంత్రణకు అధికారులు చేపట్టిన చర్యలను సీఎం జగన్‌కు వివరించారు. శుక్రవారం ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4 వేలకుపైగా పరీక్షలు నిర్వహించామని అధికారులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ర్యాపిడ్‌ పరికరాలు, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో పరీక్షల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అధికారులు వివరించారు. కోవిడ్‌-19 పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్‌ ఉండేదని,  ప్రస్తుతం వీటి సంఖ్య  7కు పెంచగలిగామని, వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. తిరుపతిలో అదనంగా 2, కర్నూలులో ఒకటి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఒక్కో ల్యాబ్‌  చొప్పున పెంచుతున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. (కరోనా నుంచి పూర్తిగా కోలుకుని..)

టెలిమెడిసిన్‌కు స్పందన వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఇప్పటి వరకు టెలీమెడిసిన్‌కు 5219 మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయని, వారికి తిరిగి కాల్‌ చేసి వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రిస్కిప్షన్లు పంపించామని, మందులు కూడా ఇస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అలాగే రవాణా వ్యవస్థలో కాస్త కదలిక వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 35 శాతానికి రవాణా చేరుకుందని తెలిపిన అధికారులు.. సీఎం ఆదేశాల ప్రకారం క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. శుభ్రత, పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని వెల్లడించారు. (‘చంద్రబాబు తెలంగాణ ప్రతిపక్ష నాయకుడా?’)

విపత్తు సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ రైతులను ఆదుకుంటున్న సమయంలో కూడా ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వ్యవసాయ మిషన్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. ఒక పత్రిక ఎడిటర్‌కు రొయ్యల వ్యాపారి ఫోన్‌ చేసి ప్రభుత్వాన్ని తిట్టినట్టుగా సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావాలనే ఉద్దేశంతోనే ఇలాంటివి సృష్టిస్తున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని,  మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 603 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మృతల సంఖ్య 15కి చేరింది. (కరోనా: ఏపీలో మరో 31.. మొత్తం 603)

Advertisement

తప్పక చదవండి

Advertisement