ఆయన రాజీనామా చేస్తారు.. మీరు చేస్తారా?

ఆయన రాజీనామా చేస్తారు.. మీరు చేస్తారా? - Sakshi


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాలుగోరోజు సభ సవాళ్లు.. ప్రతి సవాళ్లతో వేడెక్కింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మీద టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. గవర్నర్ ప్రసంగంలో అంశాలు కాకుండా, వైఎస్ పాలనా కాలంలో అలా జరిగింది.. ఇలా జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై తెలుగుదేశం పార్టీ చేసిన అభాండాలపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా స్పందించారు.


వైఎస్ పాలనపై టీడీపీ లేనిపోని అభాండాలు వేస్తోందని, చంద్రబాబు నాయుడు పాస్పోర్టు చెక్ చేస్తే ఆయన సింగపూర్ ఎన్నిసార్లు వెళ్లారో తెలుస్తుందని, అలాగే గాలి జనార్ధనరెడ్డిని కాలువ శ్రీనివాసులు సింగపూర్ తీసుకెళ్లి చంద్రబాబుతో ఎన్నిసార్లు భేటీ చేయించారో స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కూడా చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లారని గుర్తు చేశారు. శ్రీకాంత్ రెడ్డి వాటిని నిరూపిస్తారని, నిరూపించలేకపోతే ఆయన రాజీనామా చేస్తారని, నిరూపిస్తే కాలువ శ్రీనివాసులు రాజీనామా చేస్తారా అని సవాలు చేశారు. నిండు సభ సాక్షిగా తాను సవాలు చేస్తున్నానని ఆయన చెప్పారు.



వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆయన అప్పుడు అలా చేశారు, ఇలా చేశారంటూ తవ్వుకోవడం సరికాదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన తర్వాత వేరే ప్రభుత్వం, వేరే ముఖ్యమంత్రులు ఐదేళ్లు పాలన చేశారని, నిజంగా టీడీపీవాళ్లు మాట్లాడాలనుకుంటే.. సభలో లేని వ్యక్తి, మరణించి.. సభకు రాలేని వ్యక్తి గురించి మాట్లాడటం కంటే గవర్నర్ ప్రసంగంలో అంశాలను ప్రస్తావించి, రైతుల రుణాలను ఎలా మాఫీ చేస్తారో, రైతుల భయాలను ఎలా దూరం చేస్తారో మాట్లాడాలని అన్నారు.


ప్రశ్నలు అడగాల్సింది తామని, సమాధానాలు చెప్పాల్సింది ప్రభుత్వమని చెప్పారు. అయినా వైఎస్ఆర్పై ధూళిపాళ్ల తన ఆరోపణలు కొనసాగిస్తూనే వచ్చారు. దాంతో, స్పీకర్‌కు నోటీసు ఇవ్వకుండా..స్పీకర్‌ అనుమతి లేకుండా సభలో లేని, సభకు రాలేని వ్యక్తుల గురించి మాట్లాడమేంటని వైఎస్ జగన్‌ నిలదీశారు. గవర్నర్ ప్రసంగం పేరిట ఐదేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి గురించి చర్చేంటని, ఇష్టమొచ్చినట్లుగా అసెంబ్లీ నడుస్తుంటే నిబంధనలు ఉండి ఎందుకని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎలా నడుస్తోందన్నది ప్రజలు గమనిస్తున్నారని ఆయన చెప్పారు.


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top