
వైఎస్ జగన్ తన పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకున్నారు.
సాక్షి, శ్రీకాకుళం: నిత్యం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన పుట్టిన రోజును అభిమానుల మధ్య జరుపుకున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న జననేత టెక్కలి నియోజకవర్గంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జననేతకు ఆశీర్వచనం ఇచ్చారు. వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల్లోని ఆయన అభిమానులు జననేత జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గతేడాది జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
పాదయాత్రలో ఉన్న జననేతను కలిసిన పలువురు పార్టీ నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఎచ్చెర్ల సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్, పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వి కళావతి, కంబాల జోగులు, సీనియర్ నాయకులు పాలవలస రాజశేఖరం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఉన్నారు.