పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

YS Jagan Birthday Celebrations At Party Central Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ ​జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్‌ కట్‌ చేసి జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో వైఎస్సార్‌ సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌ రెడ్డి,  ఇక్బాల్‌, పద్మజ, నారాయణమూర్తిలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి పార్టీ నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.  

ఈ సందర్భంగా రాజమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇంత సుదీర్ఘమైన పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్‌ ఆశయాలు పుణికిపుచ్చుకుని జననేత ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఇంతటి మహా నాయకుడిని అంతమొందించాలని కొందరు దుర్మార్గులు ప్రయత్నించారని.. వారు ఎవరనేది త్వరలోనే బయట పడుతుందని అన్నారు. ఏపీలో దుష్ట పాలన అంతమొందే సమయం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు. 2019లో ప్రజలు వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు.

రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో గ్రామగ్రామాన వైఎస్‌ జగన్‌ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జననేత జన్మదిన వేడుకను ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారు. ఒకసారి విభజనతో మోసపోయిన రాష్ట్రం.. మరోసారి చంద్రబాబు పాలనతో చీకట్లోకి వెళ్లిపోయింది. దీని నుంచి బయటపడటానికి వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావాలి. తొమ్మిదేళ్లుగా ఎన్నో పోరాటాలతో రాటుదేలిన వైఎస్‌ జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమ’ని తెలిపారు.

విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం జాతీయ స్థాయిలో నిబద్దత కలిగి ఉన్న ఏకైక నాయకుడు కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. ఎన్నో కేసులు పెట్టినప్పటికీ, దాడులు చేస్తున్నా ఆయన ప్రజల ఆశీర్వాదంతో వాటిని ఎదుర్కొంటూ వస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండా వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం పోరాడుతున్నారని గుర్తుచేశారు.

ఇక్బాల్‌ మాట్లాడుతూ.. విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని తెలిపారు. వైఎస్‌ జగన్‌ నిజాయితీ కారణంగానే ప్రజాభిమానం వెల్లువలా వస్తోందన్నారు. రానున్న మూడు దశాబ్ధల పాటు వైఎస్‌ జగన్ సుభిక్ష పాలన ఉండబోతుందని దీమా వ్యక్తం చేశారు. నరకాసుర పాలన అంతం కావడానికి రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యానించారు.

గట్టు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారని అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top