యువతి ఆత్మహత్య

Young woman committed suicide In West Godavari district - Sakshi

సెల్‌ఫోన్‌ కోసం అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ

 మనస్తాపంతో ఉరి వేసుకున్న పిక్కి భారతి

నిడదవోలు : ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవతో మనస్తాపం చెందిన యువతి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెరవలి మండలం పెరవలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన పిక్కి తాతాలు, రూతి దంపతులకు నలుగురు సంతానం. వీరు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం పెరవలి వచ్చారు. స్థానిక రవళి స్పిన్నింగ్‌ పరిశ్రమలో పనిచేసిన వారు ఇటీవల ఆ ఉద్యోగాలు మానివేశారు.

 ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరు రవళి స్పిన్నింగ్‌ పరిశ్రమ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెక్కి తాతాలు, రూతిలు తమ ఇద్దరు కుమార్తెలు పిక్కి భారతి (20), రాణిలను ఇంటిలో వదిలి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇద్దరు కుమార్తెలను ఆ తర్వాత రావాలని కోరారు. భారతి, రాణిల మధ్య సెల్‌ఫోన్‌ కోసం శనివారం గొడవ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య ఆ గొడవ తీవ్రస్థాయికి చేరి ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భారతి (20) ఇంట్లో గదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

గొడవపడిన తరువాత తన అక్క ఇంట్లోకి వెళ్లి పడుకుని ఉంటుందని భావించిన చెల్లి రాణి వంట చేసిన తరువాత గది తలుపు తట్టి పిలవగా గదిలో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో భయంతో కేకలు వేసింది. స్పిన్నింగ్‌ మిల్లు సిబ్బంది, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో రాణి అక్కను ఆటోలో తణుకులో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే భారతి మృతి చెందినట్లు  వైద్య సిబ్బంది నిర్ధారించారు. పెరవలి ఎస్సై జగదీశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top