ఆకతాయి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

Young woman commits suicide in srikakulam - Sakshi

శ్రీకాకుళం సిటీ: బంగారం దొంగిలించడంతో ఓనర్‌ మందలించాడు. దీంతో ఆ యువకుడు యజమానిపై పగ పెంచుకున్నాడు. చివరకు ఓనర్‌ కుమార్తె, తాను ప్రేమించుకుంటున్నామని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో నీ పరువు, నీ కుటుంబం పరువు తీస్తానంటూ బెదిరించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి గల కారణాలను వివరిస్తూ లెటర్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం చంపాగల్లి వీధిలో కండవెల్లి శ్రీనివాసరావుకు ఓ జ్యూయలరీ వర్క్‌షాపు ఉంది. 

ఇందులో కొటినూరి ప్రశాంతికుమార్‌ ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. దుకాణంలో ప్రశాంత్‌ ఇటీవల బంగారాన్ని చోరీ చేస్తుండడంతో యజమాని శ్రీనివాసరావు మందలించాడు. దీంతో అతడిపై ప్రశాంత్‌కుమార్‌ కక్ష పెంచుకున్నారు. శ్రీనివాసరావుకు బీఎస్సీ కంప్యూటర్స్‌ చేసిన కుమార్తె మాధురి(25) ఉంది. బావతో ఆమెకు పెళ్లి కూడా నిశ్చయమైంది.   ప్రశాంత్‌ కుమార్‌ ప్రేమ పేరుతో మాధురిని వేధించడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే కుటుంబ పరువు తీస్తానని బెదిరించాడు. ఈ విషయం కుటుంబసభ్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో ప్రశాంత్‌కుమార్‌ను పనిలోంచి తొలగించారు. 

ఏప్రిల్‌ 24న పని మానేసిన ప్రశాంత్‌.. మళ్లీ మాధురిని వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం ఉదయం బాత్‌రూమ్‌కిని వెళ్లిన మాధురి బంగారంలో వేసే సైనేడ్‌ని మింగి ఆత్మహత్యకు పాల్పడింది. నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్లగా.. అప్పటికే మాధురి మృతిచెందింది. ‘ప్రశాంతికుమార్‌ నా పరువు, నా కుటుంబం పరువు తీశాడు. నాపై తప్పుడు ప్రచారం చేశాడు’ అంటూ ఆమె  సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఒకటో పట్టణ ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు పేర్కొన్నారు. ప్రశాంత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top