టీడీపీ పాలనలో సిక్కోలుకు అన్యాయమే | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో సిక్కోలుకు అన్యాయమే

Published Fri, May 19 2017 3:22 AM

టీడీపీ పాలనలో సిక్కోలుకు అన్యాయమే - Sakshi

జిల్లాలో మేజర్‌ ప్రాజెక్టు ఒక్కటీ తెచ్చింది లేదు
వైఎస్‌ హయాంలోనే బృహత్తర ప్రాజెక్టులు
ప్రజాసమస్యలు చూడటానికే జగన్‌ పర్యటన
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు


సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:     ఈ మూడేళ్ల కాలంలోనే కాదు గత దఫా పదహారేళ్ల టీడీపీ పాలనలోనూ జిల్లాకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఈ జిల్లాకు చెప్పుకోదగిన మేజర్‌ ప్రాజెక్టు ఏదీ టీడీపీ ప్రభుత్వం తీసుకురాలేదన్నారు. గురువారం శ్రీకాకుళంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఈ మూడేళ్ల కాలంలో లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం... సిక్కోలు అభివృద్ధికి ఎంత వాటా కేటాయించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

 చివరకు విభజన నష్టాన్ని పూడ్చేందుకు 12 జాతీయ సంస్థలను కేంద్ర ప్రభుత్వం 13 జిల్లాలున్న ఈ రాష్ట్రానికి ఇస్తే వాటిలో ఏ ఒక్కటీ శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే శ్రీకాకుళం జిల్లాకు బృహత్తర ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు. ఆయన జీవించి ఉంటే వంశధార విస్తరణ ప్రాజెక్టు ఎప్పుడో రైతులకు అందుబాటులోకి వచ్చేందని ధర్మాన అన్నారు. ఈ ప్రాజెక్టు కొద్దిపాటి పెండింగ్‌ పనులను పూర్తి చేయడంపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. వంశధార నిర్వాసితుల నిరసనను, వారి ఆవేదనను వినే ప్రయత్నం ఏనాడూ చేయలేదన్నారు.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ జరిగినా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి రెండు మూడు ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీంతో వంశధార నిర్వాసితులు కూడా అదే నిర్ణయాన్ని ఆశించడం సహజమేనన్నారు. ఒకే రాష్ట్రంలో భిన్నమైన విధానాలు అనుసరించడం వల్లే నిర్వాసితులు నిస్సాహాయ స్థితిలో ఉన్నారని చెప్పారు. వారి ఆవేదనను వినాలని, అక్కడున్న సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకోవాలని శుక్రవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ధర్మాన వివరించారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా, భవిష్యత్తులో రాష్ట్ర పాలనాపగ్గాలు చేపట్టబోయే నాయకుడిగా జగన్‌ నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని అన్నారు.

 ఉద్దానం ప్రాంతంలో సరైన పోషకాహారం తీసుకోలేని కుటుంబాల్లోనే కిడ్నీ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందని ధర్మాన చెప్పారు. ప్రభుత్వం ప్రకటనల్లో కనిపిస్తున్నంత ఊరట అక్కడ ప్రజల్లో మాత్రం కనిపించట్లేదన్నారు. కిడ్నీ వ్యాధితో మరణాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి జగన్‌ పర్యటన సమంజసమేననడంలో సందేహం లేదన్నారు. ఇది అందరూ స్వాగతించాల్సిన కార్యక్రమమని ధర్మాన అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement