పెరిగిపోతున్న జనాభా..ఇక తగ్గదా!

World Population Day Special Article - Sakshi

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం 

నగర జనాభా 24, 48,405

విశాఖ రోజురోజుకూ విస్తరిస్తోంది. విభిన్న శాఖలతో విరాజిల్లుతోంది. బహుముఖరంగాలకు కేంద్రంగా నిలుస్తోంది. చిన్న మత్స్యకార గ్రామం నుంచి మహా నగరంగా రూపుదిద్దుకుంది. ‘స్మార్ట్‌’ సిటీగా ప్రయాణం సాగిస్తోంది. జనాభా పరంగా చూస్తే 21.1లక్షల మంది విశాఖలో జీవిస్తున్నారు. శివార్లను కలుపుకుంటే ఆ సంఖ్య 24,48,405కు చేరుకుందని గణాంక శాస్త్ర నిపుణుల అంచనా. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...  
– ఏయూక్యాంపస్‌ (విశాఖతూర్పు)

సాక్షి, విశాఖపట్టణం : జిల్లా పరిధిలో గణాంకాలను పరిశీలిస్తే 2011 నాటికి 42.91 లక్షలు.  2001నాటికి ఇది కేవలం 38.32 లక్షలు మాత్రమే. ప్రతీ చదరపు కిలోమీటరుకు 384 మంది జీవిస్తున్నారు. విశాఖ జిల్లా 11,161 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

లెక్కల్లో నగరం... 
2011 లెక్కల ప్రకారం నగరంలోని మొత్తం జనాభా 17,28,128 వీరిలో పురుషులు 8,73,599 మంది,  స్త్రీలు 8,54,529 మందివీరిలో అక్షరాస్యులు 12,79,137..   నగరంలో అక్షరాస్యత 81.79% 
పురుషుల్లో అక్షరాస్యత 87.25%.. మహిళల్లో అక్షరాస్యత 76.22%.. ఆరేళ్ల లోపు చిన్నారులు 1,64,129.. బాలురు 84,298..  బాలికలు 79,831  

ఆందోళనకరం...
విద్యావంతులు నివసించే నగరంలో లింగ నిష్పత్తి  ఆందోళన కలిగించే విధంగా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 978 మహిళలున్నారు. చిన్నారుల లింగ నిష్పత్తి కేవలం 947 మంది మాత్రమే ఉండడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1003 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతంలోనే స్త్రీల జనాభా ఎక్కువగా ఉందనేది గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. పట్టణవాసుల ఆలోచన విధానంలో మార్పురావాలనే విషయాన్ని లింగ నిష్పత్తి స్పష్టం చేస్తోంది..జలంతోనే జీవనం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన నీటి వనరుల్ని అందించడం ఎంతో అవసరం.

నాణ్యమైన నీటిని నిత్యం అందించేందుకు  ప్రస్తుతం ఉన్న జలవనరులు సరిపోవు. వీటిని శుభ్రం చేయకపోవడం, పూడికలు తొలగించి నిల్వ సామర్థ్యాలను పెంచే చర్యలను కాలానుగుణంగా చేపట్టాలి. దశాబ్ధాలుగా తూతూ మంత్రంగానే వీటి పునరుద్ధరణ జరుగుతోంది. ప్రధాన నీటి వనరులైన మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి జలాశయాలను సంరక్షించే చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. వర్షాభావ పరిస్థితులు తలెత్తినపుడు వీటి విలువ, ఆవశ్యకతను గుర్తించడం కంటే ముందుగానే మేలుకోవడం మంచిది. అదే విధంగా ప్రతీ ఇంటిలో వాననీటి సంరక్షణ విధానాల్ని కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తులో నగరం నీటికొరతతో విలవిల్లాడాల్సిన పరిస్థితి. 

విభజన తరువాత విశాఖపై ఒత్తిడి...
ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రతీ సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి వలస వస్తున్నారు. కొందరు ఉపాధిని వెతుక్కుంటూ వస్తుంటే, మరికొందరు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్ధేశ్యంతో ఇక్కడ స్థిరపడుతున్నారు. విభజన తరువాత విశాఖపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన నగరం కావడం, రోడ్డు, విమాన, జల రవాణా సదుపాయాలు కలిగి ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా జనాభా పెరుగుతూ వస్తోంది. విశాఖ తొలి నుంచి పారిశ్రామికంగా ముందువరుసలో ఉంది. పరిశ్రమలు లక్షలాది మంది ప్రజలకు ఉపాధిని, దేశానికి అవసరమైన వాణిజ్యాన్ని అందిస్తున్నాయి. దీనితో ఉపాధి ఆశించి పెద్దసంఖ్యలో ప్రజల ఇక్కడ స్థిరపడుతున్నారు.

పెరిగిన విద్య, వైద్య సదుపాయాలు... 
కేవలం కొద్దిపాటి ప్రభుత్వ పాఠశాలలు, ఏవీఎన్, వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ కళాశాలలతో ప్రారంభమైన విశాఖ విద్యా వ్యవస్థ నేడు శరవేగంగా విస్తరించింది. నగరంలో ప్రస్తుతం ముప్ఫైకి పైగా ఇంజినీరింగ్, 
వందల సంఖ్యలో డిగ్రీ కళాశాలు, అదేస్థాయిలో ఇంటర్‌ కళాశాలలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. నవ్యాంధ్రకు పెద్ద దిక్కుగా నిలుస్తోన్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఐఐఎం, ఐఐపీఈ, మేరిటైం వర్సిటీ, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు వివిధ ప్రైవేటు విద్యాసంస్థలు విశాఖను విద్యల రాజధానిగా నిలుపుతున్నాయి. వైద్య రంగంలో సైతం విశాఖ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన హెల్త్‌ సిటీ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేదిగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మెరుగైన వైద్యం కోసం నిత్యం ఎంతోమంది విశాఖకు వస్తున్నారు. నగరం ప్రాధాన్యాన్ని పెంచుతున్నారు. 

మురికివాడల నిర్మూలనతోనే.. 
నగరం నానాటికీ పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనలో గత ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దాలంటే నగరంలో మురికివాడలను పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలి. వీటి స్థానంలో ప్రజలకు పక్కా ఇళ్లను నిర్మించాలి. ప్రస్తుతం మురికివాడల సహితంగా ఉన్న విశాఖను మురికివాడల రహితంగా మలచేందుకు ప్రణాళికలు రూపొందించాలి. నగరంలో 900 పైగా మురికివాడలు ఉన్నట్లు అంచనా.

నేర, ప్రమాదాల నిలయం..
సాంకేతికంగా స్మార్ట్‌ నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖ అదే స్థాయిలో నేరాలకు రాజధానిగా మారిపోతోంది. ఇటీవల కాలంలో నగరంలో ఆర్థిక నేరాలు, హత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. అదే సమయంలో సైబర్‌ నేరాలకు నిలయంగా మారుతోంది. సాంకేతికతను లాభదాయకంగా మార్పుచేసుకుంటూ నేరాలను నియంత్రించే దిశగా పోలీసు యంత్రాంగం పయనించాల్సిన అవసరం ఉంది.

ట్రాఫికర్‌
పెరుగుతున్న వాహనాలు, ప్రజల అవసరాల కారణంగా నగరంలో ట్రాఫిక్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ట్రాఫిక్‌ నియంత్రణలో సరైన సాంకేతికత వినియోగించకపోవడం, ఇరుకు రోడ్డు వెరసి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా పోలీస్‌ స్టేషన్లు, సిబ్బంది సైతం లేక పోవడం మరో ప్రధాన సమస్య. 

ప్లానింగ్‌ అవసరం... 
నగరం రోజురోజుకీ పరిధిని పెంచుకుంటోంది. జనాభా ఏటా పెరుగుతోంది. వీటికి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల్నిప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కచ్చితమైన విధానాలను అనుసరించాలి.  
– ఆచార్య బి.మునిస్వామి, గౌరవ సంచాలకులు, ఏయూ పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top