ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం | World Bank inspection team report was missing | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక మాయం

Oct 10 2017 1:32 AM | Updated on Oct 1 2018 2:16 PM

సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఏపీ రాజధాని ప్రాంతంపై తనిఖీ బృందం నివేదిక మాయం అయింది. ఆదివారం రాత్రి వరకు వెబ్‌సైట్‌లో తనిఖీ బృందం సిఫార్సులతో కూడిన నివేదిక అందుబాటులో ఉండింది. సోమవారం ఉదయం నుంచి అది కనిపించడం లేదు. ప్రభుత్వ పెద్దలే ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తనిఖీ బృందం నివేదికను వెబ్‌సైట్‌ నుంచి తీయించారని అధికార వర్గాలు, రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయపడుతున్నారు. తనిఖీ బృందం పూర్తి స్థాయి నివేదిక అందుబాటులో ఉంటే ప్రభుత్వం చెబుతున్న అంశాలకు, తనిఖీ బృందం పేర్కొన్న అంశాల మధ్య వ్యత్యాసాలు, వాస్తవ పరిస్థితులు అందరికీ తెలిసిపోతాయని, తద్వారా అంతర్జాతీయంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఒత్తిడి తెచ్చి తొలగించారని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక పబ్లిక్‌ డిస్కోలజర్‌ పేరుతోనే వెబ్‌సైట్‌లో ఉంచారు. అంటే ప్రజలందరికీ ఆ నివేదిక అందుబాటులో ఉండాలనేది బ్యాంకు అభిమతం. పత్రికల్లో తనిఖీ నివేదిక సారాంశం గురించి వార్తలు రావడంతో నివేదిక వెబ్‌సైట్‌లో కనిపించడం లేదంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు అర్థం అవుతోందని ఆ అధికారి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు న్యూఢిల్లీ విభాగం ఆ నివేదిక స్థానంలో పత్రికా ప్రకటనను వెబ్‌సైట్‌లో ఉంచింది. అమరావతి సుస్థిర కేపిటల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం నివేదిక తమ అంతర్గత వ్యవహారమని, ఈ నివేదిక ఆధారంగా బ్యాంకు బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. 

బ్యాంకు విధానాల్లో తనిఖీ తప్పనిసరి
ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులను తనిఖీ బృందం పరిశీలించడం తప్పనిసరి అని, దీని వల్ల అమరావతి ప్రాజెక్టు ప్రతిపాదనలపై ఎటువంటి ప్రభావం ఉండదని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.బ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వంతో పని చేస్తుందని, ప్రతిపాదనలు, డిజైన్లు, బ్యాంకు ఆర్థిక సాయం అంగీకరించిన షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement