హవ్వా.. ఇంత అధ్వానమా

Worce Tiolets In Government Schools In West Godavari - Sakshi

సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : పైన పటారం..లోన లొటారం అన్న చందంగా ఉంది జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయం పరిస్థితి. ప్రసిద్ధి చెందిన పెదవేగిలోని ఈ విద్యాలయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బాత్‌రూమ్‌లు అధ్వానంగా ఉన్నాయి. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఆందోళనలో తల్లిదండ్రులు
ఇంటికి వచ్చిన పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే  మరుగుదొడ్ల సమస్య దారుణంగా ఉందని చెబుతున్నారన్నారు. తాము స్వయంగా వెళ్లి చూస్తే పరిస్థితి పిల్లలు చెప్పిన దానికన్నా అధ్వానంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి అపారిశుద్ధ్య వాతావరణంలో తమ పిల్లలు ఉంటే రోగాల బారినపడతారని వారంతా భయపడుతున్నారు.

560 మంది విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జవహర్‌ నవోదయ పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.

విద్యార్థులతో పనులు
జవహర్‌ నవోదయ విద్యాలయంలో వసతులు, విద్య, అన్ని రంగాల్లో భేష్‌ అంటూ ఊదరగొట్టే యాజమాన్యం తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులతో పనులు చేస్తున్నారు. ట్యాంక్‌ మరమ్మత్తులో భాగంగా విద్యార్థులు ఐరన్‌ ఊసలు పట్టుకుని సిబ్బందికి సహకరిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. తరగతి గదుల్లో ఉండాల్సి విద్యార్థులు ఇలా పనులు చేస్తూ కనిపించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కలెక్టర్‌తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం
నవోదయ విద్యాలయంలో టాయిలెట్స్‌ అధ్వానంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నవోదయ  కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలు అందులో సీటు కోసం  ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. కాని  సదుపాయాలు ఇలా  ఉన్నాయని తెలీదు. జిల్లా  కలెక్టర్‌కు చెప్పి మరమ్మతులు చేపడతాం.
– కోటగిరి శ్రీధర్, ఎంపీ, ఏలూరు 

సమస్య 10 రోజుల్లో పరిష్కరిస్తాం
అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, బిల్డింగ్స్‌ మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతున్నాం.   కలెక్టర్‌ దగ్గర నుంచి అనుమతులు ఇప్పించి పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తాం. 
 – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు శాసనసభ్యుడు

పనివాళ్లు దొరకడం లేదు
విద్యాలయంలో మరుగుదొడ్లు బాలేని మాట వాస్తవమే. నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. దానికి  ఆరు నెలల సమయం పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పనివాళ్లు దొరకడం లేదు. దాంతో సక్రమంగా శుభ్రం చేయించలేకపోతున్నాం.
 – డాక్టర్‌ వైఎస్‌ఎస్‌ చంద్రశేఖర్, ప్రిన్సిపల్, నవోదయ విద్యాలయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top