మద్యం వద్దే వద్దు!

Womens Protest On Wine Shop Ban In Village Prakasam - Sakshi

గురిజేపల్లిలో బ్రాందీషాపు ఎత్తేయాలని మహిళల రాస్తారోకో

జాతీయ రహదారిపై  బైఠాయించి ఆందోళన

దాదాపు గంటపాటు  నిలిచిన రాకపోకలు

తమ గ్రామం మద్యం దుకాణాన్ని తొలగించాలని యర్రగొండపాలెం మండలం గురిజేపల్లికి చెందిన మహిళలు సోమవారం రాస్తారోకోనిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన చేశారు.

ప్రకాశం ,యర్రగొండపాలెం: తమ గ్రామంలో బ్రాందీషాపు ఎత్తేయాలని మహిళలు జాతీయ రహదారిపై దాదాపు గంటపాటు రాస్తారోకో చేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని గురిజేపల్లిలో సోమవారం జరిగింది. తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేయాలని మహిళలు డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారి పక్కనే ఇప్పటి వరకు గోలుసు దుకాణం నిర్వహించారు. మండలంలో మొత్తం ఆరు లైసెన్స్‌ షాపులు ఉండగా నాలుగు షాపులు పట్టణంలో,  మానిగుడిపాడు, కొలుకులలో ఒక్కొక్కటి చొప్పున నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఒకషాపు మెయింటినెన్స్‌ ఖర్చులు కూడా రావడంలే దని కొన్ని నెలలుగా మూలేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గురిజేపల్లిలోని బెల్ట్‌షాపును పర్మినెంట్‌ షాపుగా మార్చారు.

మద్యం కోసం సమీప గ్రామాలైన బోయలపల్లె, సర్వాయపాలెం, వాదంపల్లె గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు ద్విచక్ర వాహనాలపై వచ్చి మద్యం తాగుతున్నారు. జాతీయ రహదారిపై షాపు ఉండటంతో భారీ వాహనాలు సైతం మద్యం కోసం నిలుపుతారన్న ఆందోళన మహిళలు వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మద్యం దుకాణం తెరిచే ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. రెండు రోజులుగా మద్యం పుటుగా తాగి గ్రామంలో అల్లర్లు చేస్తున్నారని, ఇంట్లో మహిళలను కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామంలోని పలు గృహాల్లో గోడవలు ప్రారంభమయ్యాయి. ఒకరు మద్యం మత్తులో తన భార్యకు ఉరేసేందుకు విఫలయత్నం చేశాడు. మరొకరు భార్యను చితకబాదాడని మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు రోడ్డు ఎక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించడంతో అనేక వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ దేవకుమార్‌ తన సిబ్బందితో వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి షాపు ఎత్తేయిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు రాస్తారోకో విరమించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ సాయంత్రం పోలీసులు రక్షణగా మద్యం అమ్మకాలు జరిపించడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top