స్త్రీనిధిని బొక్కేశారు ! | woman gramaikya community fund money managers bokkesaru | Sakshi
Sakshi News home page

స్త్రీనిధిని బొక్కేశారు !

Oct 27 2013 2:36 AM | Updated on Sep 2 2017 12:00 AM

మహిళల వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిధి సొమ్మును గ్రామైక్య సంఘం నిర్వాహకులు బొక్కేశారు.

గుడివాడ, న్యూస్‌లైన్ : మహిళల వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిధి సొమ్మును గ్రామైక్య సంఘం నిర్వాహకులు బొక్కేశారు. రూ.2లక్షలకు పైగా సొమ్మును స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇది తెలుసుకున్న డ్వాక్రా మహిళలు లబోదిబోమంటూ డీఆర్‌డీఏ అధికారుల్ని ఆశ్రయించగా స్వాహా చేసిన వారిపై కేసు  నమోదు చేశారు.  వివరాలిలా ఉన్నాయి.  

గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు శివారు గంగాధరపురం గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రామైక్య సంఘానికి ఈఏడాది జూలై16న స్త్రీనిధి మంజూరు అయ్యింది. 26 గ్రూపులున్న ఈ గ్రామైక్య సంఘంలో గంగాధరపురానికి చెందిన సాయి స్వశక్తి సంఘంలో రూ.90వేలు, శ్రీహర్షా స్వశక్తి సంఘంలో రూ.70వేలు, వర్షిత స్వశక్తి సంఘంలో రూ.15వేలు... ఇలా మొత్తం రూ.1.75 లక్షలు స్వాహాకు గురయినట్లు  అధికారులు  గుర్తించారు. ఇవిగాక  గ్రామైక్య సంఘంలో  ఉన్న 36మందికి మంజూరైన స్కాలర్‌షిప్పుల సొమ్మునీ దిగమింగినట్లు తెలుస్తుంది. దాదాపు ఇదో రూ. 25వేల వరకు ఉంటుందని అంచనా.
 
అధ్యక్షురాలు, బుక్‌కీపర్‌లే స్వాహారాణులు...


గ్రామైక్య సంఘం స్త్రీనిధి ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు జల్లా విజయశ్రీ, బుక్‌కీపర్ నేలపాటి లక్ష్మీ తమ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. జూలై 16న మూడు గ్రూపులకు స్త్రీనిధి మంజూరు కాగా ఆ మొత్తాన్ని రెండవ రోజే వారి ఖాతాల్లోకి మార్చుకున్నట్లు బ్యాంకు అధికారుల నుంచి వచ్చిన నివేదికలో తేలింది. రుణం తీసుకుని రెండు నెలలు గడుస్తున్నా గ్రూపు సభ్యుల నుంచి  రికవరీ రాకపోవటంతో బ్యాంకు అధికారులు డీఆర్‌డీఏ అధికారులను వివరణ అడిగారు.

సంబంధిత గ్రూపులకు నోటీసులు  పంపారు. దీంతో తాము రుణం తీసుకోకుండా నోటీసులు ఏమిటని లబోదిబోమంటూ అధికారుల్ని కలువగా కూపీ లాగితే వచ్చిన సొమ్మును గ్రామైక్యసంఘం అధ్యక్షురాలు, బుక్‌కీపర్ తమ సొంత ఖాతాలోకి మార్చుకున్నారని తేలింది. మూడు రోజుల క్రితం డీఆర్‌డీఏ ఏపీఎం మూర్తి, మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్ అరుణ  కలిసి గ్రామైక్య సంఘాన్ని సమావేశపరచి వారిని నిలదీశారు. దీంతో తాము ఆ సొమ్ము వాడుకున్నట్లు చెప్పినట్లు సమాచారం.
 
స్కాలర్‌షిప్పుల సొమ్మునూ నొక్కేశారు...

 గ్రామైక్య సంఘం పరిధిలో ఉన్న సభ్యులు ఆమ్‌ఆద్మీయోజన, అభయహస్తం చెల్లించిన సభ్యుల కుటుంబంలో ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు   మంజూరయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ. 1200 చొప్పున గ్రామైక్య సంఘంలోని 36మందికి రూ.43,200 మంజూరుకాగా వాటిలో దాదాపు రూ.25వేలు వరకు స్వాహా చేసినట్లు తెలుస్తుంది.  
 
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు...

గుడివాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లగా గుడివాడ ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నందున వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పటంతో గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. గ్రామైక్య సంఘంలో గతంలో కోశాధికారిగా పనిచేసిన సుజాత స్థానిక ఎంపీడీవోకు సొమ్ము స్వాహా జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఐకేపీకి చెందిన మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్  సీ.అరుణను వివరణ కోరగా సొమ్ము దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమేనని , చర్యలు తీసుకుంటామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement