అల్లనేరేడు.. ఆల్కహాల్‌ పంట!  | Wine Making At Home In Anantapur District | Sakshi
Sakshi News home page

అల్లనేరేడు.. ఆల్కహాల్‌ పంట! 

Nov 21 2019 10:02 AM | Updated on Nov 21 2019 10:03 AM

Wine Making At Home In Anantapur District - Sakshi

ఉద్దేహాళ్‌లో మారుతీప్రసాద్‌ ఇంటి వద్ద స్వాధీనం చేసుకున్న ఆల్కహాల్‌ బాటిళ్లు  

బొమ్మనహాళ్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ పి.మారుతీప్రసాద్‌ సంపాదనకు సరికొత్త దారి వెతుక్కున్నారు. నేరేడు తోటలను సాగుచేస్తున్న ఆయన.. పండ్లను అమ్మితే పెద్దగా లాభంలేదని భావించాడు. వాటిని కుళ్లబెట్టి వైన్‌గా మార్చి.. కాసుల పంట పండి స్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధానికి అడుగులు వేస్తుండగా మారుతీప్రసాద్‌ ఏకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అమ్మకాలు జోరుగా సాగించాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  అధికారులు బుధవారం అతని ఇంటిపై దాడి చేసి  నేరేడు వైన్‌ దందాకు చెక్‌ పెట్టారు. 

సాక్షి, అనంతపురం: ఉద్దేహాళ్‌ గ్రామ మాజీ సర్పంచు పి.మారుతీప్రసాద్‌కు ఐదు ఎకరాల పొలం ఉండగా.. రెండున్నర ఎకరాల్లో రెండంతస్తుల భారీ భవంతిని నిర్మించుకున్నాడు. మరో రెండున్నర ఎకరాల్లో నేరేడు తోటను సాగుచేస్తున్నాడు. పంట చేతికి రాగా మార్కెట్‌లో పెద్దగా రేటు పలకడం లేదు. దీంతో అతను సరికొత్త దారి వెతుక్కున్నాడు. మద్య నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో బెల్టుషాపులతో పాటు వైన్స్‌ దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించింది. మరోవైపు లిక్కర్‌ రేట్లను కూడా పెంచింది. దీంతో మారుతీప్రసాద్‌ నేరేడు పండ్ల రసం తీసి దాన్ని పులియబెట్టి వైన్‌గా మార్చాడు. లీటర్‌ రూ.500 ధర నిర్ణయించాడు. ఇది తాగితే ఫుల్‌ కిక్కు ఇస్తుండగా.. జనం కొనేందుకు ఎగబడ్డారు. లీటర్, 180 ఎంఎల్, 20 లీటర్ల క్యాన్‌లో ఆల్కహాలిక్‌ నేరేడు జ్యూస్‌ నింపి ‘నేచురల్‌ జామున్‌ జ్యూస్‌ హోమ్‌మేడ్‌’ పేరుతో విక్రయాలు సాగించాడు.

పబ్లిసిటీ కోసం ఏకంగా ఫ్లెక్సీలు వేశాడు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ టి.విజయశేఖర్‌ తన సిబ్బందితో కలిసి బుధవారం మారుతీ ప్రసాద్‌ ఇంటిపై దాడులు చేశారు. ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉన్న నేరేడు పండ్ల రసం క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరేడు తోటతో పాటు ఇంటి పరసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో తోటలోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 456 నేరేడు వైన క్యాన్‌లను, కుళ్లిపోయిన నేరేడు పండ్లను వైన్‌గా  మార్చేందుకు వినియోగించే హ్యాండ్‌మోటార్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.45.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. నిందితుడు మారుతీప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. మరోవైపు  స్వాధీనం చేసుకున్న నేరుడు పండ్ల రసాన్ని అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ బి.శ్రీనివాసరెడ్డి, గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంఏ ఖలీముల్లాలు పరిశీలించారు. ఇది దాదాపు వైన్‌తో సమానమని అధికారులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement