breaking news
Excise Enforcement Officers
-
అల్లనేరేడు.. ఆల్కహాల్ పంట!
బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామ మాజీ సర్పంచ్ పి.మారుతీప్రసాద్ సంపాదనకు సరికొత్త దారి వెతుక్కున్నారు. నేరేడు తోటలను సాగుచేస్తున్న ఆయన.. పండ్లను అమ్మితే పెద్దగా లాభంలేదని భావించాడు. వాటిని కుళ్లబెట్టి వైన్‌గా మార్చి.. కాసుల పంట పండి స్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మద్యనిషేధానికి అడుగులు వేస్తుండగా మారుతీప్రసాద్ ఏకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అమ్మకాలు జోరుగా సాగించాడు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం అతని ఇంటిపై దాడి చేసి నేరేడు వైన్ దందాకు చెక్ పెట్టారు. సాక్షి, అనంతపురం: ఉద్దేహాళ్ గ్రామ మాజీ సర్పంచు పి.మారుతీప్రసాద్‌కు ఐదు ఎకరాల పొలం ఉండగా.. రెండున్నర ఎకరాల్లో రెండంతస్తుల భారీ భవంతిని నిర్మించుకున్నాడు. మరో రెండున్నర ఎకరాల్లో నేరేడు తోటను సాగుచేస్తున్నాడు. పంట చేతికి రాగా మార్కెట్లో పెద్దగా రేటు పలకడం లేదు. దీంతో అతను సరికొత్త దారి వెతుక్కున్నాడు. మద్య నిషేధంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో బెల్టుషాపులతో పాటు వైన్స్ దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించింది. మరోవైపు లిక్కర్ రేట్లను కూడా పెంచింది. దీంతో మారుతీప్రసాద్ నేరేడు పండ్ల రసం తీసి దాన్ని పులియబెట్టి వైన్‌గా మార్చాడు. లీటర్ రూ.500 ధర నిర్ణయించాడు. ఇది తాగితే ఫుల్ కిక్కు ఇస్తుండగా.. జనం కొనేందుకు ఎగబడ్డారు. లీటర్, 180 ఎంఎల్, 20 లీటర్ల క్యాన్‌లో ఆల్కహాలిక్ నేరేడు జ్యూస్ నింపి ‘నేచురల్ జామున్ జ్యూస్ హోమ్మేడ్’ పేరుతో విక్రయాలు సాగించాడు. పబ్లిసిటీ కోసం ఏకంగా ఫ్లెక్సీలు వేశాడు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.విజయశేఖర్ తన సిబ్బందితో కలిసి బుధవారం మారుతీ ప్రసాద్ ఇంటిపై దాడులు చేశారు. ఆల్కహాల్ కంటెంట్ ఉన్న నేరేడు పండ్ల రసం క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నేరేడు తోటతో పాటు ఇంటి పరసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో తోటలోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన 456 నేరేడు వైన క్యాన్లను, కుళ్లిపోయిన నేరేడు పండ్లను వైన్‌గా మార్చేందుకు వినియోగించే హ్యాండ్మోటార్ను స్వాధీనం చేసుకొన్నారు. వీటి విలువ రూ.45.80 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా. నిందితుడు మారుతీప్రసాద్ పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న నేరుడు పండ్ల రసాన్ని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాసరెడ్డి, గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎంఏ ఖలీముల్లాలు పరిశీలించారు. ఇది దాదాపు వైన్‌తో సమానమని అధికారులు నిర్ధారించారు. -
నైజీరియన్ డ్రగ్స్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్ : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్ డివిజన్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి సోమవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ఖాదర్‌బాగ్‌లోని ఓ ఇంటిపై నెల రోజులు గా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో ఆ ఇంటిపై అధికారులు దాడి చేసి అందులో నివసిస్తున్న ఐవరీకోస్ట్ పౌరుడు జాడి పాస్కల్తోపాటు ఒగోచుకు చిమ గుడ్‌లక్ , ఒకోరో ఉచెన్నా శామ్యూల్ అనే ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 101 ప్యాకెట్లలోని 101 గ్రాముల కొకైన్, విడిగా ఉన్న 153 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.20 లక్షల నగదు, 3 బైక్‌లు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నైజీరియా నుంచే మానిటరింగ్.. ఖాదర్‌బాగ్‌లోని ఆ ఇంట్లో నైజీరియాకు చెందిన లక్కీ ఒబీసీ అనే వ్యక్తి మూడేళ్లపాటు ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జాడి పాస్కల్‌ను ఈ ఇంట్లోకి దించి లక్కీ నైజీరియా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లే ముందే జాడీ పాస్కల్కు డ్రగ్స్ దందాను అప్పగించాడు. ముంబైలోని డాండీ అనే వ్యక్తి సహాయంతో పాస్కల్కు లక్కీ డ్రగ్స్ సరఫరా చేస్తూ నైజీరియా నుంచి మానిటరింగ్ చేసేవాడు. సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్ నెట్ ద్వారా లక్కీ అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నుంచి ఆర్డర్ తీసుకునేవాడు. బెంగళూరుకు చెందిన మరో డ్రగ్ డీలర్‌తో... జాడి పాస్కల్ బెంగళూరుకు చెందిన ఇబుకా అనే స్మగ్లర్తోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. ఇబుకా సహచరుడు ఒగోచుకు చిమ గుడ్‌లక్ నుంచి జాడి పాస్కల్ కొకైన్ కొనుగోలు చేసి విక్రయించేవాడు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందానికి అతను పట్టుబడ్డాడు. సేఫ్‌గా ఉంటుందనే బస్ జర్నీ: ముంబై, బెంగు ళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా నడిపిస్తున్న స్మగ్లర్లు బస్సుల్లోనే ప్రయాణించేవారని విచారణలో వెల్లడైంది. కార్లు, విమానాలు, రైళ్లలో ప్రయాణించినా పోలీసులకు పట్టుబడతామని భావించి బస్సుల్లో ప్రయాణించేవారు. లక్కీ, ఇబుకాలు బస్సుల్లో తమ అనుచరులను హైదరాబాద్‌కు పంపించి జాడి పాస్కల్కు కొకైన్ అందించి డబ్బులను తీసుకుని వెళ్లేవారు. రూ.6 వేలకు ఒక గ్రాము కొకైన్ : పాస్కల్‌ను అదుపులోకి తీసుకుని అతడి సెల్ఫోన్లో ఉన్న వివరాల ఆధారంగా 11 మంది కొకైన్‌ను సరఫరా చేసినట్లు గుర్తించారు. మరింత విచారణ చేపట్టాక కొకైన్‌ను కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఒక గ్రాము రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు పాస్కల్ ఒప్పుకున్నాడు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారిలో అధికశాతం ఆర్థికంగా బలంగా ఉండే యువతనే ఉన్నట్లు తెలుస్తుంది. -
సారా బట్టీలపై విస్తృత దాడులు
విజయనగరం రూరల్: కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మలక్ష్మిపురం మండలం, ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాల్లోని బొద్దిడి, గోయిపాక, పోసంబాడి గ్రామాల్లో సారా బట్టీలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు జరిపారు. ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళి ఆధ్వర్యంలో 75 మంది అధికారులు సిబ్బంది పాల్గొని 6150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే పెద్దపెద్ద ట్యాంకులు, డ్రమ్ములు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 160 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నలుగురిపై బైండోవర్ నమోదు చేశారు. నల్లబెల్లం వ్యాపారులపై నిఘా పెంచారు. దాడుల అనంతరం బొద్దిడి, గోయిపాక, పోసంబాడి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహించారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు సహకరించాలని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సారా తయారీ, అమ్మకం, సరఫరా చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం ఈఎస్ విక్టోరియా రాణి, ఏఈఎస్ ఆర్.ప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ లోకేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ ఎ.శ్రీరంగందొర, కురుపాం, పార్వతీపురం సీఐ జె.శ్రీనివాసరావు, విజయ్కమార్లు, ఎస్ఐలు నాగభూషణరావు, రాజశేఖర్,దాసు, మధు, రమణ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.