కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మలక్ష్మిపురం మండలం, ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాల్లోని బొద్దిడి,
విజయనగరం రూరల్: కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గుమ్మలక్ష్మిపురం మండలం, ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతాల్లోని బొద్దిడి, గోయిపాక, పోసంబాడి గ్రామాల్లో సారా బట్టీలపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు జరిపారు. ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళి ఆధ్వర్యంలో 75 మంది అధికారులు సిబ్బంది పాల్గొని 6150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి ఉపయోగించే పెద్దపెద్ద ట్యాంకులు, డ్రమ్ములు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 160 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని నలుగురిపై బైండోవర్ నమోదు చేశారు.
నల్లబెల్లం వ్యాపారులపై నిఘా పెంచారు. దాడుల అనంతరం బొద్దిడి, గోయిపాక, పోసంబాడి గ్రామాల్లో బుధవారం గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు నిర్వహించారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు సహకరించాలని ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సారా తయారీ, అమ్మకం, సరఫరా చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో పార్వతీపురం ఈఎస్ విక్టోరియా రాణి, ఏఈఎస్ ఆర్.ప్రసాద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ వై.భీమ్‌రెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ లోకేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ ఎ.శ్రీరంగందొర, కురుపాం, పార్వతీపురం సీఐ జె.శ్రీనివాసరావు, విజయ్‌కమార్‌లు, ఎస్‌ఐలు నాగభూషణరావు, రాజశేఖర్,దాసు, మధు, రమణ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.