నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు | Nigerian Drugs Gang Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

నైజీరియన్‌ డ్రగ్స్‌ ముఠా అరెస్టు

Jun 25 2019 2:18 AM | Updated on Jun 25 2019 2:18 AM

Nigerian Drugs Gang Arrested In Hyderabad - Sakshi

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న వివేకానందరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ :  ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ డివిజన్‌ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వివేకానందరెడ్డి సోమవారం ఇక్కడ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ఖాదర్‌బాగ్‌లోని ఓ ఇంటిపై నెల రోజులు గా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నంద్యాల అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. పక్కా సమాచారంతో ఆ ఇంటిపై అధికారులు దాడి చేసి అందులో నివసిస్తున్న ఐవరీకోస్ట్‌ పౌరుడు జాడి పాస్కల్‌తోపాటు ఒగోచుకు చిమ గుడ్‌లక్‌ , ఒకోరో ఉచెన్నా శామ్యూల్‌ అనే ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 101 ప్యాకెట్లలోని 101 గ్రాముల కొకైన్, విడిగా ఉన్న 153 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.20 లక్షల నగదు, 3 బైక్‌లు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.  

నైజీరియా నుంచే మానిటరింగ్‌.. 
ఖాదర్‌బాగ్‌లోని ఆ ఇంట్లో నైజీరియాకు చెందిన లక్కీ ఒబీసీ అనే వ్యక్తి మూడేళ్లపాటు ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జాడి పాస్కల్‌ను ఈ ఇంట్లోకి దించి లక్కీ నైజీరియా వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లే ముందే జాడీ పాస్కల్‌కు డ్రగ్స్‌ దందాను అప్పగించాడు. ముంబైలోని డాండీ అనే వ్యక్తి సహాయంతో పాస్కల్‌కు లక్కీ డ్రగ్స్‌ సరఫరా చేస్తూ నైజీరియా నుంచి మానిటరింగ్‌ చేసేవాడు. సెల్‌ఫోన్, వాట్సాప్, ఇంటర్‌ నెట్‌ ద్వారా లక్కీ అందుబాటులో ఉంటూ హైదరాబాద్‌ నుంచి ఆర్డర్‌ తీసుకునేవాడు.  

బెంగళూరుకు చెందిన మరో డ్రగ్‌ డీలర్‌తో...  
జాడి పాస్కల్‌ బెంగళూరుకు చెందిన ఇబుకా అనే స్మగ్లర్‌తోనూ సంబంధాలు పెట్టుకున్నాడు. ఇబుకా సహచరుడు ఒగోచుకు చిమ గుడ్‌లక్‌ నుంచి జాడి పాస్కల్‌ కొకైన్‌ కొనుగోలు చేసి విక్రయించేవాడు. ఈ క్రమంలోనే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందానికి అతను పట్టుబడ్డాడు.  

సేఫ్‌గా ఉంటుందనే బస్‌ జర్నీ: ముంబై, బెంగు ళూరు కేంద్రంగా డ్రగ్స్‌ దందా నడిపిస్తున్న స్మగ్లర్లు బస్సుల్లోనే ప్రయాణించేవారని విచారణలో వెల్లడైంది. కార్లు, విమానాలు, రైళ్లలో ప్రయాణించినా పోలీసులకు పట్టుబడతామని భావించి బస్సుల్లో ప్రయాణించేవారు. లక్కీ, ఇబుకాలు బస్సుల్లో తమ అనుచరులను హైదరాబాద్‌కు పంపించి జాడి పాస్కల్‌కు కొకైన్‌ అందించి డబ్బులను తీసుకుని వెళ్లేవారు.  

రూ.6 వేలకు ఒక గ్రాము కొకైన్‌ : పాస్కల్‌ను అదుపులోకి తీసుకుని అతడి సెల్‌ఫోన్‌లో ఉన్న వివరాల ఆధారంగా 11 మంది కొకైన్‌ను సరఫరా చేసినట్లు గుర్తించారు. మరింత విచారణ చేపట్టాక కొకైన్‌ను కొనుగోలు చేసిన వారి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఒక గ్రాము రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు పాస్కల్‌ ఒప్పుకున్నాడు. డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నవారిలో అధికశాతం ఆర్థికంగా బలంగా ఉండే యువతనే ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement