విద్యా సంస్థల పర్యవేక్షణకు వెబ్‌సైట్‌

Website for monitoring educational institutions - Sakshi

ఆవిష్కరించిన సీఎం జగన్‌

వసతులు, ప్రమాణాల వివరాలను స్కూళ్లు, కాలేజీలు అప్‌లోడ్‌ చేయాలి

తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు

ఆ డొమైన్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది

వసతులు లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు

సాక్షి, అమరావతి: విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటైంది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యా రంగంపై మేధోమథన సదస్సు అనంతరం ఈ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. తమ విద్యా సంస్థల్లోని వసతులు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు స్వయంగా ఆ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తాయని, ఆ డొమెయిన్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వెబ్‌సైట్‌లో పేర్కొన్న వసతులు, ప్రమాణాలు నిజంగా క్షేత్రస్థాయిలో లేకపోతే ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వెబ్‌సైట్‌ అందరికీ అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు. వెబ్‌సైట్‌ ఐడీ : www. apsermc. ap. gov. in. 

కార్పొరేట్‌ సంస్కృతికి చెక్‌
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. విద్యా రంగంలో కార్పొరేట్‌ సంస్కృతికి చెక్‌ పెడుతున్నామని.. అందుకోసం రెండు కమిషన్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీటి బాధ్యతలను ఇద్దరు హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, జస్టిస్‌ ఈశ్వరయ్యకు అప్పగించామన్నారు. ఒకరు పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు బాధ్యత వహిస్తారని చెప్పారు. ఇప్పటికే ఆ కమిషన్లు పనులు మొదలు పెట్టాయన్నారు. జస్టిస్‌ ఆర్‌. కాంతారావు కమిషన్‌ గత ఫిబ్రవరిలో 172 స్కూళ్లు తనిఖీ చేసి 62 స్కూళ్లకు నోటీసులు జారీచేయగా, జస్టిస్‌ ఈశ్వరయ్య కమిషన్‌ 130 కాలేజీలు తనిఖీచేసి 40 కాలేజీలపై చర్య తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top