
అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దాం
మున్సిపాలిటీ అభివృద్ధికి అని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సి.ఆది నారాయణరెడ్డి పేర్కొన్నారు.
జమ్మలమడుగు: మున్సిపాలిటీ అభివృద్ధికి అని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సి.ఆది నారాయణరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం చైర్‌పర్సన్ తాతిరెడ్డి తులసి అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన మున్సిపాలిటీ చైర్మన్‌ల సమావేళంలో మంత్రి నారాయణ నిధులివ్వలేమని చెప్పారన్నారు. దీంతో మున్సిపాలిటీలే స్వయంగా నిధులు సమకూర్చుకోవలసిందే అన్న సంకేతాలను ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిందన్నారు. మున్సిపాలిటీలో జమ, ఖ ర్చు బేరీజు చూసుకోవడంతోపాటు రావలసిన పన్ను బకాయిలు వెంటనే రాబట్టాలన్నారు.
అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పట్టణంలోని ప్రజలకు నీటి పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చాయన్నారు. అయితే రాష్ట్ర విభజన మూలంగా హైదరాబాద్‌లో దానికి సంబంధించిన ఫైల్ కనిపించడంలేదని సంబంధింత అధికారులు సూచిస్తున్నారని తెలిపారు. కౌన్సిలర్లు అందరూ, ఎమ్మెల్యే కలిసి ప్రభుత్వంపై వత్తిడి తెస్తే పన్నుల తగ్గించేందుకు ఆవకాశం ఉందన్నారు. అలాగే పట్టణంలోని మురికివాడల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.7కోట్లు ఖర్చు అవుతుందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సి ఉందన్నారు. దీనిపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
తమవంతు కృషి చేస్తా: ఎంపీ అవినాష్‌రెడ్డి
మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రావలసిన నిధులను రాబట్టేటందుకు ప్రయత్నిస్తామన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైతే ఎంపీ గ్రాంటును కూడ ఇస్తామన్నారు. మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తాతిరెడ్డి తులసి మాట్లాడుతూ అక్టోబర్ 2నుంచి పట్టణంలో పందులను, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తామన్నారు. వారం రోజుల్లో పట్టణంలో ఎక్కడ కూడ పందులు కనిపించకూడదని, అలా కనిపిస్తే వాటిని మున్సిపాలిటీ సిబ్బంది పట్టుకుని వేలం పాట నిర్వహిస్తారన్నారు. ఫ్లాస్టిక్ కవర్లు అమ్మిన వారికి రూ.5వేలు, కొన్నవారికి రూ.500, చిరు వ్యాపారులకు రూ.250 జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ మూల్లా జానీ, ఇరుపార్టీల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.