ఓట్లు మావే..సీట్లు మావే | we will achieve seats with our votes, says r. krishnaiah | Sakshi
Sakshi News home page

ఓట్లు మావే..సీట్లు మావే

Dec 16 2013 1:13 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఓట్లు మావే..సీట్లు మావే - Sakshi

ఓట్లు మావే..సీట్లు మావే

ఇన్నాళ్లూ మా ఓట్లు వేయించుకుని సీఎంలు, పీఎంలు అయ్యారు. ఓట్లు మావి అయితే సీట్లు మీవయ్యాయి. బీసీలకు దక్కాల్సిన సీట్లను అగ్రకులాలు కబ్జా పెట్టారుు.

సాక్షి, హైదరాబాద్: ‘ఇన్నాళ్లూ మా ఓట్లు వేయించుకుని సీఎంలు, పీఎంలు అయ్యారు. ఓట్లు మావి అయితే సీట్లు మీవయ్యాయి. బీసీలకు దక్కాల్సిన సీట్లను అగ్రకులాలు కబ్జా పెట్టారుు. ఓట్లు మావి అయినప్పుడు సీట్లు మీవి ఎలా అవుతాయి? ఇకపై ఓట్లు మావే.. సీట్లూ మావే.. వచ్చేది బీసీల రాజ్యమే..’ అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఈ దేశంలో బీసీ కులాల్లో పుట్టడ మే పాపమయిందని, సమర్థ నాయకులున్నా వారు బీసీలయినందుకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదని విమర్శించారు. రాజకీయ పార్టీల్లోని బీసీ నేతలను అణచివేస్తే సహించేది లేదని వారి పని పడతామని హెచ్చరించారు. రానున్న ఎన్నికలలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 150 అసెంబ్లీ, 22 పార్లమెంటు స్థానాలు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

 

లేదంటే బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఆదివారం నిజాం కళాశాల మైదానంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ‘బీసీల సింహగర్జన’ మహాసభలో ఆయన మాట్లాడారు. తాము ఏ కులానికీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం లేదని, బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమది ఆకలి పోరాటమే కాదు.. ఆత్మగౌరవ పోరాటం కూడానని, ప్రతి బీసీ అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. తాము ఎవరినీ భిక్షం అడ గడం లేదని, ప్రజాస్వామిక వాటాను మాత్రమే డిమాండ్ చేస్తున్నామంటూ.. ‘చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే ఖబడ్దార్..’ అని హెచ్చరించారు.
 
 బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు గ్రామగ్రామానికి వెళ్తామని, జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని చెప్పారు. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఆదరణకు నోచుకోని కులాలకు న్యాయం చేయడమే తమ విధానమని అన్నారు. బీసీలకు 100 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామని, రూ. 10 వేల కోట్లతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల్లో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని, అన్ని కులాలు ఒక్కతాటిపైకి వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బీసీ నాయకుడు ప్రధాని అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.
 
 బడ్జెట్‌లో కేవలం రూ. 4 వేల కోట్లు కేటాయించి రూ. 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అన్ని పార్టీలు జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బూడిద భిక్షమయ్యగౌడ్, అనిల్‌కుమార్, జైపాల్‌యాదవ్, ఎల్. రమణ, పి.జె.చంద్రశేఖర్‌రావు, బి. వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, వినయభాస్కర్, జోగురామన్న, కావేటి సమ్మయ్య, సోమారపు సత్యనారాయణ, భిక్షపతి, పూల రవీందర్‌లతో పాటు విమలక్క, వి.శ్రీనివాస్‌గౌడ్, వకుళాభరణం కృష్ణమోహనరావు, గుజ్జ కృష్ణ, ఆల్‌మెన్‌రాజు, దానకర్ణాచారి, వి.రామారావుగౌడ్ తదితరులు సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
 
 చంద్రబాబుకు నిరసనల సెగ
 
 రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు నిర్వహించిన బహిరంగ సభను తన ప్రచారానికి వినియోగించుకుని అనుచిత లబ్ధి పొందాలనుకున్న చంద్రబాబు వ్యూహం ఫలించలేదు. సింహగర్జన సభలో ‘చంద్రబాబూ.. గో బ్యాక్’ నినాదాలు మార్మోగారుు. ఆయన సభావేదికపైకి ఎక్కడం గమనించిన వెంటనే ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌లు వేదిక దిగి వెళ్లిపోవడంతో మొదలైన నిరసన ఆయన వేదిక దిగి వెళ్లిపోయేంతవరకు ఆగలేదు. వీహెచ్, అంజన్‌లు వెళ్లిన వెంటనే రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా అదే బాట పట్టారు. ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చంద్రబాబుకు చురకలు వేస్తూ మాట్లాడారు.
 
 వేదిక ఎదురుగా ఉన్న యువత, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా నినదించారు. ఆయన మాట్లాడేందుకు వీలులేదని భీష్మించారు. ఒకదశలో ఆర్.కృష్ణయ్య కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ యువకులు వెనక్కి తగ్గలేదు. ఓ చేత్తో చెప్పులు చూపిస్తూ, మరో చేత్తో ప్లకార్డులు పట్టుకుని, కుర్చీలు పెకైత్తి నిరసన తెలిపారు. మహిళలు సైతం గొంతు కలిపారు. టీజీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్ బాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ముందుగా చంద్రబాబుతోనే మాట్లాడించారు. తెలంగాణ వాదుల నిరసనను పట్టించుకోకుండా 20 నిమిషాల సేపు ప్రసంగించిన బాబు ఆ వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. అప్పుడు కూడా కొందరు యువకులు ఆయన వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపు చేశారు. చంద్రబాబు వేదికపై కూర్చున్న సమయంలో ఓయూ విద్యార్థులు నిజాం కళాశాల మైదానంలోనే ధర్నాకు దిగారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement