ఆదివారం బీసీ జేఏసీ సమావేశంలో సంఘీభావం తెలుపుతున్న జూలూరు గౌరీ శంకర్, బీర్ల ఐలయ్య, వీహెచ్, ఈటల, నారాయణమూర్తి, జాజుల శ్రీనివాస్, దాసు సురేశ్, గుజ్జ కృష్ణ తదితరులు (కుడి నుంచి ఎడమకు)
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మరిన్ని పోరాటాలు
గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరినీ ఏకం చేసి పోరాడుదాం.. బీసీ జేఏసీ సమావేశంలో అఖిలపక్షం, కుల సంఘాల నిర్ణయం
6 నుంచి వరుస పోరాటాలతో కేంద్రంపై ఒత్తిడి
జనవరి 4వ వారంలో హైదరాబాద్‌లో బహిరంగ సభ
బంజారాహిల్స్: బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని, లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్‌లో ‘బీసీ రిజర్వేషన్ల పెంపు.. భవిష్యత్ కార్యాచరణ’పై బీసీ జేఏసీ ఆదివారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించగా, కో చైర్మన్ దాసు సురే‹Ù, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ సమన్వయం చేశారు.
సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచి్చన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని తెలిపారు. రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బీసీలకే అన్యాయం జరుగుతోందని అన్నారు. దగా పడ్డ బీసీలు దండుకట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గత నెల 18న నిర్వహించిన రాష్ట్ర బంద్ తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలోనే పోరాడటానికి సమస్త శ్రేణులను, సామాజిక ఉద్యమ శక్తులను ఏకం చేస్తూ బీసీ జేఏసీని మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు..
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ స్పష్టంచేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఆమోదం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తెస్తామని తెలిపారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని, పార్టీలను పక్కనపెట్టి మరో పోరాటాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.
మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీసీలు తెలంగాణలో ఒంటరి కాదని, వారికి సకల జనులు అండగా నిలబడతారన్న విషయం ఇటీవలి బంద్‌తో తేటతలమైందని పేర్కొన్నారు. సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేడ్కర్, ఫూలే చూపించిన మార్గంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు దండు కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ కొల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


