5 కాదు..10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి: ముద్రగడ

we want to10 percent reservation for kapu, says mudragada padmanabham - Sakshi

ఏపీలో కోటికి పైగా కాపులు ఉన్నారు

మా జాతి కోసమే నేను రోడ్డుపైకి వచ్చా

2018 మార్చి 31 వరకూ ఉద్యమానికి తాత్కాలిక విరామం

కిర్లంపూడి : ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోజనం పెడతామని టిఫెన్‌ పెట్టారు. అయిదు శాతం కాదు...మాకు 10 శాతం రిజర్వేషన్ కావాలి’  అని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘పల్స్‌ సర్వేలో కాపు జనాభా లెక్కను తక్కువ చేసి చూపుతున్నారు. ఏపీలో కోటికి పైగా కాపులు ఉన్నారు. ఇది ఉత్సవాలు చేసుకునే సమయం కాదు. 9వ షెడ్యూల్‌లో పెట్టినప్పుడే కాపులకు నిజమైన దీపావళి. ఇచ్చిన హామీల గురించి అడిగితే చంద్రబాబు లాఠీలతో కొట్టించారు.

మాటి మాటికి నా వెనుక వైఎస్‌ జగన్‌ ఉన్నారని మీ అనుచరులతో చెప్పించడం సబబు కాదు. ఇచ్చిన హామీ అడిగితే వారిని అవమానించే పని చేయవద్దు. నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే యత్నం చేయకండి. నేనెప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకోలేదు. మా జాతి కోసమే నేను రోడ్డుపైకి వచ్చాను. నేను ఎప్పుడైనా మీ సహాయం కోరానా. ఒక్క రూపాయి అడిగానా?. ఇతరులకు రిజర్వేషన్లు ఎలా వర్తిస్తున్నాయో... మాకు కూడా వర్తించాలి. 2018 మార్చి 31 వరకూ ఉద్యమానికి తాత్కాలిక విరామం. ఆ గడువులోగా కాపు రిజర్వేషన్‌లను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి. ఉద్యమం కోసం పోరాటం చేసినవారికి కాపు రుణాలు అందలేదు. బ్యాలెన్స్‌లో ఉన్న రుణాల నిధులను మంజూరు చేయండి. ఇచ్చిన హామీ అమలు కానప్పుడు దాన్ని సాధించుకోవడం కోసం మా ప్లాన్లు మాకున్నాయి.’ అని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top