సాగునీరు అందించేందుకు కృషి 

We Try To Give Irrigation water Said By  Katasani Ramabhupal Reddy - Sakshi

ఏటిపాయ చెక్‌డ్యామ్‌ నిర్మిస్తాం 

గోరుకల్లు నుంచి ప్రతి గ్రామానికీ నీటిని మళ్లిస్తాం  

ఎమ్మెల్యే కాటసాని 

సాక్షి, పాణ్యం: మండలంలోని తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తమ్మరాజుపల్లెలో ఏటి పాయ చెక్‌డ్యామ్‌ను నిర్మిస్తామన్నారు. ఆయన మంగళవారం గోరుకల్లు గ్రామంలో మొహర్రం సందర్భంగా పెద్ద సరిగెత్తును పురస్కరించుకుని  పెద్ద స్వామికి ప్రత్యేక ఫాతెహాలు చదివించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు ప్రతి ఏటా నీటిసమస్య ఎదురవుతోందన్నారు. ఈ మూడు గ్రామాలు వర్షాధారంపైనే పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోందన్నారు.

కళ్ల ముందే నీరు వెళ్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. కావున ఈ మూడు గ్రామాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తమ్మరాజుపల్లెకు  ఏళ్ల నాటి కలగా మిగిలిన ఏటిపాయ నిర్మాణం జరిపి పొలాలకు సాగునీరు, గ్రామానికి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు  కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. గోరుకల్లు బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎత్తిపోతల స్కీమ్‌ తెచ్చి పిన్నాపురం, తమ్మరాజుపల్లెకు పుష్కలంగా నీరు ఉండేలా కొచ్చేరును నింపుతామన్నారు.

కందికాయపల్లె గ్రామానికి కూడా ఈ జలాలు ఉపయోగించుకునేలా  రామతీర్థం వద్ద గానీ, మరో చోట గానీ  మోటార్ల సహాయంతో నీటిని పంపింగ్‌ చేయించి.. పైన ఉన్న చెరువును నింపుతామన్నారు. ఓర్వకల్లు కూడా నీటిని సరఫరా చేయించి తాగునీటి సమస్యకు శాశ్వత  పరిష్కారం చూపుతామన్నారు. అలాగే రోడ్ల విస్తీరణలో నష్టపోయిన ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు కొట్టాల అమర్‌నాథ్‌రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ఇమాం, భాస్కర్‌రెడ్డి , నాగిరెడ్డి, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top