తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు ఒక్క చోట కూర్చొని సమస్యలపై చర్చించడానికి ఈ నెల 24 లేదా 25న ‘సోదర సద్భావన సదస్సు’ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు ఒక్క చోట కూర్చొని సమస్యలపై చర్చించడానికి ఈ నెల 24 లేదా 25న ‘సోదర సద్భావన సదస్సు’ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ చెప్పారు. సమైక్యంగా ఉంటే ఎదురయ్యే సమస్యలు, విభజన వల్ల వచ్చే సమస్యలపై చర్చించడం మొదలు పెడితే ఇరు ప్రాంతాల ఉద్యోగులు, ప్రజల్లో విద్వేషాలు తగ్గే అవకాశాలుంటాయని శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.
అయితే, శాంతిభద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందన్న కారణంతో ఈ సదస్సుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆడిటోరియాలను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలోనైనా సదస్సు నిర్వహిస్తామని, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఇక్కడికి వస్తారో, లేదో వారితో మాట్లాడిన తర్వాతే తెలుస్తుందని అన్నారు.
నేడు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు
ఆదివారం చర్చలకు రావాలని ప్రభుత్వం కోరిందని అశోక్‌బాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలోనే చర్చలు ఉంటాయని తెలిపిందని, ఏఏ అంశాలపై చర్చిస్తారో వెల్లడించలేదని చెప్పారు. విభజనపై చర్చించే పరిధి ఉపసంఘానికి ఉంటుందని తాము భావించడంలేదన్నారు. చర్చలకు ఆర్టీసీ కార్మికులనూ తీసుకెళ్తామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరతామన్నారు. సోమవారం నుంచి ఈనెల 30 వరకు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూసేయాల్సిందేనని స్పష్టం చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థ లు తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాయని చెప్పారు. విద్యార్థులను ఇళ్లకు పంపించడానికి అవకాశం లేని చోట హాస్టళ్లు నడపవచ్చన్నారు.