ఎక్కడి వాళ్లక్కడే

Visakhapatnam railway zone is not the staff transfers - Sakshi

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పడ్డా సిబ్బంది బదిలీలు లేనట్లే

హైదరాబాద్‌ విడిచివెళ్లేందుకు ఉద్యోగుల విముఖత

‘ఆప్షన్‌’ అవకాశాన్ని వినియోగించుకోనున్న వైనం

ప్రత్యేక అవసరాల రీత్యా రైల్‌ నిలయం నుంచే కొందరి బదిలీకి చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌ అయిన ప్రత్యేక రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల ఆధారంగా విభజన జరిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు విశాఖ రైల్వే జోన్‌ (దక్షిణ కోస్తా), ఏపీలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ మధ్య రైల్వే (హైదరాబాద్‌ కేంద్రం) పరిధిలోనే కొనసాగనున్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే యావత్తూ ఒక యూనిట్‌గా ఉన్నందున రాష్ట్రాల సరిహద్దులు ప్రాతిపదికగా తీసుకోబోమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణ ప్రాంతంలోని మిర్యాలగూడ.. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో కొనసాగనుంది. అలాగే ఏపీ పరిధిలోని కర్నూలు టౌన్‌ హైదరాబాద్‌ కేంద్రంగా ఉండే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి రానుంది.

బదిలీలకు అవకాశం లేదు...
ఆరు డివిజన్లతో ఉన్న దక్షిణ మధ్య రైల్వేను కేంద్రం రెండు భాగాలుగా విభజించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందెడ్‌ డివిజన్లు పాత జోన్‌లో కొనసాగుండగా విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో కొత్తగా దక్షిణ కోస్తా జోన్‌ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటవుతోంది. ఈ ఆరు జోన్లలో రెండు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోన్‌ విడిపోయినప్పటికీ ఈ సిబ్బంది మాత్రం ఎక్కడి వారక్కడే ఉండనున్నారు. తెలంగాణకు చెందిన వారు దక్షిణ మధ్య రైల్వేకు, ఏపీకి చెందిన వారు దక్షిణ కోస్తా జోన్‌కు బదిలీ అయ్యే అవకాశం లేదు.

రైల్‌ నిలయం నుంచి బదిలీ కావాల్సి ఉన్నా...
దక్షిణమధ్య రైల్వే జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దాదాపు 1,700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా ఆరు డివిజన్లకు సంబంధించిన విధులను పర్యవేక్షిస్తుంటారు. ఇప్పుడు మూడు డివిజన్లతో కొత్త జోన్‌ ఏర్పాటవుతున్నందున ఇందులో సగం మంది ఆ జోన్‌ పరిధిలోకి మారాల్సి ఉంటుంది. కానీ 90 శాతం మంది బదిలీకి సిద్ధంగా లేరు. విద్య, వైద్యం సహా ఇతర వసతులు, వాతావరణం కారణంగా ఎక్కువ మంది హైదరాబాద్‌ విడిచి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. బదిలీకి సంబంధించి వారికి ఆప్షన్‌ అవకాశం ఉండటంతో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉంటామని చెప్పనున్నారు.

దీంతో ప్రత్యేక అవసరాల రీత్యా రైల్వేశాఖనే కొంత మంది పేర్లతో బదిలీ చేసే అవకాశం ఉంది. గతంలో కలకత్తా కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే జోన్‌... తదుపరి ఈ మూడు జోన్లుగా మారింది. కానీ ఎక్కువ మంది సిబ్బంది కోల్‌కతా విడిచి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో అక్కడి ప్రభుత్వం అభ్యర్థన మేరకు రైల్వేశాఖ వారిని అలాగే కొనసాగిస్తోంది. ప్రస్తుతం కోల్‌కతాలోని రైల్వే ప్రధాన కార్యాలయంలో 2 వేల మంది సిబ్బంది అదనంగా కొనసాగుతున్నారు. అదే పద్థతిలో రైల్‌ నిలయంలో కూడా అదనంగా సిబ్బంది కొనసాగే అవకాశం ఉంది. 

కాజీపేట డివిజన్‌ ఊసేది?
విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ ఏర్పాటయితే కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ కాకుండా మహారాష్ట్రలోని నాందెడ్‌ ఇక్కడ ఓ డివిజన్‌గా ఉంది. దాని పరిధిలో ఆదిలాబాద్‌ లాంటి తెలంగాణ ప్రాంతాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని, అందుకే వాటిని కలుపుతూ కాజీపేట డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ఆదేశంలో దాని ప్రస్తావన లేదు. 

విశాఖ–హైదరాబాద్‌ మధ్య కొత్త రైళ్లకు అవకాశం...
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పెద్ద నగరం విశాఖపట్నం మధ్య ప్రయాణికుల అవçసరాలకు తగ్గ సంఖ్యలో రైళ్లు నడవటం లేదు. విశాఖపట్నం తూర్పు కోస్తా జోన్‌ పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో ఉండటంతో అక్కడి యంత్రాంతం దీన్ని పట్టించుకోలేదు. దక్షిణమధ్య రైల్వే నుంచి ప్రతిపాదనలు వెళ్లినా అమలు కాలేదు. ఇప్పుడు విశాఖ కూడా కొత్త జోన్‌ పరిధిలోకి రావడంతో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ రైళ్లకు సంబంధించి జోన్‌ డీఎం ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. కొత్త జోన్‌ డీఎం నుంచి ప్రతిపాదనలు వస్తే రైల్వే బోర్డు పచ్చజెండా ఊపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌లోనే.....
రైల్వే ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు కీలకంగా ఉంటుంది. సికింద్రాబాద్‌ కేంద్రంగా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) కార్యాలయం కొనసాగుతోంది. ఇప్పుడు కొత్త జోన్‌ ఏర్పడ్డా ఆర్‌ఆర్‌బీ కార్యాలయం మాత్రం సికింద్రాబాద్‌ కేంద్రంగానే ఉండనుంది. విశాఖపట్నంలో మరో కేంద్రం ఏర్పాటుకు రైల్వే బోర్డు సిద్ధంగా లేదని సమాచారం. దీంతో రెండు జోన్లకు కలిపి సికింద్రాబాద్‌ కార్యాలయమే పర్యవేక్షించనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కాజీపేటల్లో కొనసాగుతున్న కొన్ని రైల్వే సంస్థలు యథాప్రకారం ఎక్కడివక్కడే కొనసాగనున్నాయి. వాటిని తరలించకుండా విశాఖపట్నం జోన్‌లో కొత్తవి ఏర్పాటు చేసే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

ఐదు దశాబ్దాల బంధం...
దక్షిణమధ్య రైల్వే జోన్‌ 1966లో ఏర్పాటైంది. సదరన్‌ రైల్వేలో భాగంగా ఉన్న హూబ్లీ, విజయవాడ డివిజన్లు, సెంట్రల్‌ జోన్‌లోని షోలాపూర్, సికింద్రాబాద్‌ డివిజన్లను కలిపి కొత్త జోన్‌ ఏర్పాటు చేశారు. సదరన్‌ రైల్వేలో ఉన్న గుంతకల్‌ డివిజన్‌ను 1977లో విలీనం చేశారు. తర్వాత షోలాపూర్‌లో మళ్లీ సెంట్రల్‌ రైల్వేలో కలిపారు. ఆ సమయంలో సికింద్రాబాద్‌ డివిజన్‌ను హైదరాబాద్, సికింద్రాబాద్‌ డివిజన్లుగా విభజించారు. 2003లో జరిగిన జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సమయంలో గుంటూరు, గుంతకల్‌లు అమలులోకి వచ్చాయి. అదే సమయంలో హూబ్లీని నైరుతి జోన్‌లో కలిపారు. 

ఇవీ ప్రధాన విభాగాలు...
జోనల్‌ హెడ్‌క్వార్టర్స్‌: సికింద్రాబాద్‌ 

వర్క్‌షాప్స్‌: మొత్తం 5. లాలాగూడలో మూడు, తిరుపతి, రాయనపాడులో ఒకటి చొప్పున 

డీజిల్‌ లోకోషెడ్స్‌: కాజీపేట, గుత్తి, గుంతకల్, మౌలాలి, విజయవాడ.

ఎలక్ట్రిక్‌ లోకో షెడ్స్‌: సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ.

శిక్షణ కేంద్రాలు: మొత్తం 25. (సికింద్రాబాద్, కాజీపేట, విజయవాడ, గుంతకల్, గుత్తి, వాషిమ్‌) 

ఆసుపత్రులు: లాలాగూడ (300 బెడ్స్‌), విజయవాడ (203 బెడ్స్‌), గుంతకల్‌ (131 బెడ్స్‌), రాయనపాడు (25 బెడ్స్‌), నాందెడ్‌ (30 బెడ్స్‌) 

ఇదీ స్వరూపం...
మొత్తం డివిజన్లు (తాజా విభజనకు ముందు): 6 (హైదరాబాద్, సికింద్రాబాద్, నాందెడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌)

మొత్తం రైళ్లు: నిత్యం 275 ఎక్స్‌ప్రెస్‌లు, 348 ప్యాసింజర్‌ రైళ్లు, 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తున్నాయి.

మొత్తం సిబ్బంది: పోస్టుల సంఖ్య 97,548, సిబ్బంది సంఖ్య 79,069

డివిజన్లవారీగా ట్రాక్‌ (కి.మీ.): విజయవాడ: 2,041, సికింద్రాబాద్‌: 2,649, గుంతకల్‌: 2,238, గుంటూరు: 658, హైదరా>బాద్‌ 86

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top