ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్‌

visakhapatnam People Who Refused Defiance MLAs - Sakshi

సాక్షి, విశాఖసిటీ: పార్టీపై నమ్మకంతో గెలిపిస్తే ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేశారు. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గారు. ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతూ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన నేతల తలరాతల్ని ఓటర్లు మార్చారు. విశ్వాసఘాతుకానికి పాల్పడితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఓటర్లు బుద్ధి చెప్పారు. ఫిరాయింపుదారులు మళ్లీ తలెత్తుకోనివ్వకుండా గుర్తుండిపోయే ఓటమిని రుచిచూపించారు.

జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించి అధికార టీడీపీకి అమ్ముడు పోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీని ఘెర పరాజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. 2014లో పాడేరు అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన గిడ్డిని ఓడించి బుద్ధి చెప్పారు. వైఎస్సార్‌సీపీ తరఫున తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన భాగ్యలక్ష్మి చేతిలో 40,900 ఓట్ల తేడాతో గిడ్డి ఈశ్వరి ఓటమి పాలైంది.

అదే విధంగా అరకులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014లో విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సర్వేశ్వరరావు స్థానంలో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రి పదవి కట్టబెట్టి.. 2019 అరకు ఎమ్మెల్యే టికెట్‌ను టీడీపీ అప్పగించింది. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శెట్టి ఫాల్గుణ ఫిరాయింపు ఎమ్మెల్యే కుమారుడు, తాజా మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ని 33,172 ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు.

ఎలాంటి సానుభూతి చూపకుండా అరకు ప్రజలు కిడారిని ఇంటికి సాగనంపారు. ఇక అరకు ఎంపీగా వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన కొత్తపల్లి గీత.. వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచింది. టీడీపీ, బీజేపీ వైపు చూసిన గీత.. చివరికి జనజాగృతి పార్టీని స్థాపించి విశాఖ ఎంపీగా పోటీ చేసింది. వైఎస్సార్‌సీపీకి గీత చేసిన అన్యాయాన్ని గుర్తించుకున్న ప్రజలు.. డిపాజిట్‌ రాకుండా చేశారు. 12 లక్షల పై చిలుకు ఓట్లు పోలైన విశాఖ ఎంపీ స్థానంలో ఫిరాయింపు ఎంపీ కొత్తపల్లి గీతకు కేవలం 1,127 ఓట్లు మాత్రమే పోలవ్వడం హాస్యాస్పదం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top