48 గంటల వరకు గ్రామాలకు వెళ్లొద్దు: నీలం సాహ్ని

Visakha Gas leak: All The Victims Are Recovering Says Neelam Sahni - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఎల్‌జీ గ్యాస్‌ లీకేజీ ప్రమాదం సంభవించిన ప్రాంత సమీపంలోని ప్రజలు మరో రెండు రోజుల పాటు సొంత గ్రామల్లోకి వెళ్లొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. గ్యాస్‌ లీకేజీని అదుపులోకి తీసుకు వస్తున్నామని, బాధితులందరూ కోలుకుంటున్నారని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్‌లో ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనపై మంత్రుల బృందం శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. స్టెరైన్ను నియంత్రించడంతో పాటు బాధితుల పరిస్థితులపైచర్చించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ప్రమాద ఘటన జరిగిన వెంటనే స్పందించామని ఆమె తెలిపారు. 454 మంది బాధితులు ఆసుపత్రికి చికిత్స పొందడానికి వచ్చారని, పదివేల మంది ప్రజలకు తాము వసతి, భోజన సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు.
(గ్యాస్‌ దుర్ఘటనపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

విచారణకు టెక్నికల్ కమిటీ
విశాఖ ఘటనపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికపుడు చర్చిస్తున్నామని నీలం సాహ్ని తెలిపారు. ప్రస్తుతం టెంపరేచర్ 115 డిగ్రీలకి తగ్గిందని, అయితే వెంకటాపురం వద్ద ఇంకా కొంత శాతం గాలిలో స్టైరెన్‌ శాతాన్ని గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. అయిదు గ్రామాల ప్రజలను 48 గంటల పాటు గ్రామాలలోకి వెళ్లవద్దని‌, ప్రభుత్వ క్యాంపులోనే కొనసాగాలని సూచించారు. విశాఖ బాధితులకి అన్ని‌రకాల సాయం అందిస్తున్నామని, బాధితులకి నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల అందించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో సైతం ప్రమాద ఘటనపై విచారణకు టెక్నికల్ కమిటీని నియమించామని, ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీ విచారణ ప్రారంభించిందని పేర్కొన్నారు. స్టెరైన్ పూర్తిగా నియంత్రించిన తర్వాతే సేఫ్ అని చెప్పగలమన్నారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని నీలం సాహ్ని పేర్కొన్నారు. (గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం )

గ్యాస్‌ దుర్ఘటనపై అత్యున్నత స్ధాయి‌ కమిటీ విచారణ జరుగుతోందని విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు. వేపగుంట, పెందుర్తి రోడ్, ఇండస్ట్రీ మెయిన్ గేట్ వద్ద గాలిలో స్టెరైన్ శాతం జీరోగా ఉందన్నారు. బాధితులకు అన్ని రకాలుగా సాయం అందిస్తున్నామని, ప్రతీ మృతుని‌ కుటుంబానికి కోటి రూపాయిలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, గుమ్మునూరు జయరాం, ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ హాజరయ్యారు. (తెలంగాణలో మరో పది పాజిటివ్‌ కేసులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top